స్వలింగ వివాహాలకు(గే మ్యారేజెస్) చట్టబద్ధత కల్పించాలంటూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లను కేంద్ర ప్రభుత్వం మరోసారి వ్యతిరేకించింది. ఈ పిటిషన్ల విచారణ అర్హతను ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టు లో వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. ఇలాంటి వివాహాలకు చట్టబద్ధత కల్పిస్తే వ్యక్తిగత చట్టాలు, సామాజిక విలువల సున్నిత సమతౌల్యత పూర్తిగా దెబ్బతింటుందని కేంద్రం పేర్కొంది. వివాహాలను గుర్తించడం పూర్తిగా చట్టపరమైన అంశమని, దీనికి కోర్టులు దూరంగా ఉండాలని కోరింది.
‘’‘వివాహం అనేది ఒక సామాజిక-చట్టపరమైన వ్యవస్థ. రాజ్యాంగం ప్రకారం.. దీన్ని చట్టసభలు సృష్టించాయి. దాని ప్రకారమే వివాహానికి చట్టబద్ధత రావాలి. వివాహాలకు చట్టబద్ధతనిచ్చే అంశంలో పార్లమెంట్ అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటుంది. గ్రామీణ, సెమీ-రూరల్, పట్టణ, నగర ప్రాంత ప్రజల అభిప్రాయాలు, మతపరమైన అంశాలు, ఆచారాలు ఇవన్నింటినీ పరిశీలించిన తర్వాతే చట్టాలను రూపొందిస్తారు. కొత్త బంధాలను గుర్తించడం, ఆ బంధాలకు చట్టబద్ధత కల్పించడం వంటివి కూడా చట్టసభ్యులే నిర్ణయించాలి. అంతేగానీ ఇది న్యాయవ్యవస్థ పరిధిలోకి రాదు. అందుకే ఈ అంశంలో కోర్టులు దూరంగా ఉండాలి’’’ అని కేంద్రం తమ పిటిషన్‌లో కోరింది.