కరోనా: హెర్డ్ ఇమ్యూనిటీ ఇంకా రాలేదు.. థర్డ్ వేవ్ పై కేంద్రం హెచ్చరిక

కరోనా సెకండ్ వేవ్ సృష్టించిన భీభత్సం అంతా ఇంతా కాదు. ఎంతో మందిని పొట్టన పెట్టుకుని చాలామందికి తమ ప్రియమైన వారిని దూరం చేసింది. ఆర్థికంగా తీవ్రంగా నష్టపర్చింది. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గాయి. ఈ నేపథ్యంలో కరోనా జాగ్రత్తలు పాటించేవాళ్ళు కూడా తగ్గుతున్నారు. ఈ విషయమై భారత ప్రభుత్వం ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. కరోనా సెకండ్ వేవ్ లో కేసులు తగ్గుతున్నప్పటికీ నియమ నిబంధనలు పాటించాల్సిందేనని, హెర్డ్ ఇమ్యూనిటీ ఇంకా రాలేదని, మూడవ వేవ్ ముప్పు పొంచి ఉండే అవకాశాలు ఉన్నాయని నీతీ ఆయోగ్(ఆరోగ్య) వీకే పాల్ శుక్రవారం తెలియజేసారు.

ఇతర దేశాల్లో పెరిగే కరోనా కేసులు భారతదేశానికి ఒక థర్డ్ వేవ్ విషయంలో ఒక సంకేతం అని, అందుకే అప్రమత్తంగా ఉంటూ కరోనా జాగ్రత్తలు తప్పక పాటించాలని, ఉత్తర, దక్షిణ అమెరికా ప్రాంతాలను వదిలేస్తే మిగిలిన కొన్ని దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయని అన్నారు. స్పెయిన్, ఇండోనేషియా, బంగ్లాదేశ్, థాయ్ లాండ్ దేశాల్లో మునుపటి కంటే ఎక్కువ కేసులు వస్తున్నాయని మాట్లాడారు.