మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ స్పందించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మునుగోడు ఉపఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ ముగిసిందని తెలిపారు. ఇంకా వీవీ ప్యాట్లు లెక్కించాల్సి ఉందని.. ఆ తర్వాతే అఫిషియల్గా ఫలితాలు ప్రకటిస్తామని చెప్పారు వికాస్ రాజ్. ఎన్నిక నిర్వహణలో ఒకరిద్దరు తప్పులు చేసి ఉంటే.. వాళ్లకు చట్ట పరంగా శిక్ష తప్పదన్నారు వికాస్ రాజ్. కౌంటింగ్ హాల్లో ప్రొసీజర్ ప్రకారం ముందుకెళ్లాల్సి ఉంటుందని.. కౌంటింగ్ సమయంలో హడావుడి చేస్తే తప్పులు జరిగే అవకాశం ఉందని తెలిపారు వికాస్ రాజ్.
ఎక్కడ పక్షపాతం లేకుండా ఎన్నికలు ముగించామని వికాస్ రాజ్ అన్నారు. నవంబర్ 8న మునుగోడులో ఎలక్షన్ కోడ్ ముగుస్తుందని ఆయన వెల్లడించారు. ప్రొసీజర్ ప్రకారమే ఆర్వో ఫలితాలు విడుదల చేశారని తెలిపారు వికాస్ రాజ్. కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రశాంతంగా ముగిసిందని పేర్కొన్నారు వికాస్ రాజ్. ఇక, మునుగోడు ఉపఎన్నికకు సంబంధించిన 15 రౌండ్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసింది. వరుస రౌండ్లలో అధిక్యం కనబరిచిన అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 11 వేల మెజార్టీతో ఘన విజయం సాధించారు. బీజేపీ రెండవ స్థానంలో నిలవగా.. కాంగ్రెస్ పార్టీ 3వ స్థానంతో డిపాజిట్లు కోల్పోయింది.