అకాల వర్షాలకు తీవ్రంగా నష్టపోయి కష్టాల్లో ఉన్న రైతులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటానని టీడీపీ అధినేత చంద్రబాబు భరోసా ఇచ్చారు. కష్టాలొచ్చినప్పుడు ఆదుకునేవాడు నాయకుడవుతారు.. కష్టాలు చూసి పారిపోతే నాయకుడవుతారా? అని సీఎం జగన్ ను ఉద్దేశించి చంద్రబాబు ప్రశ్నించారు. అరెస్టు చేస్తే చేసుకోండి.. భయపడేది లేదని స్పష్టం చేశారు ఆయన. అకాల వరదల కారణంగా వరి రైతులు తీవ్రంగా నష్టపోయారని, 70 శాతం ధాన్యం ఇంకా పొలాల్లో ఉందని తెలిపారు. అసమర్ద సీఎం వల్ల నిండా మునిగిపోయామని రైతులు వాపోతున్నారని, జగన్ అసమర్ద పాలనతో రైతుల జీవితాల్ని నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తపరిచారు.
“ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతుల కష్టాన్ని రైస్ మిల్లర్లు, దళారులు దోచుకుంటున్నారు. తరుగు, తేమ అంటూ డబ్బుల్లో కోత కోస్తున్నారు. ఎకరాకు 60 బస్తాలు పండుతాయి, కానీ కేవలం 53 బస్తాలే కొంటారట, మరి మిగిలిన ధాన్యం ఎవరు కొనాలి? నేను వస్తున్నాని తెలిసి ఇప్పుడు హడావుడి అధికారులు ధాన్యం కొనుగోలు అంటూ డ్రామాలాడుతున్నారు. మరి మిగతా గ్రామాల్లో ధాన్యం పరిస్ధితి ఏంటి? ఏప్రిల్ మెదటి వారంలోనే ధాన్యం సేకరణ చేసి ఉంటే ఈ పరిస్ధితి ఉండేదా? అని చంద్ర బాబు ప్రశ్నించారు.