ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో, జూపల్లి కృష్ణారావుతో బీజేపీ కీలక నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఈరోజు భేటీ అయిన విషయం తెలిసిందే. బీజేపీలోకి పొంగులేటిని, జూపల్లి కృష్ణారావుని ఆహ్వానించడానికి ఈటల రాజేందర్ నేతృత్వంలోని చేరికల కమిటీ పొంగులేటి నివాసానికి వెళ్ళింది. సుదీర్ఘ భేటీ అనంతరం పొంగులేటి ఇంటి వద్ద ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు.
పొంగులేటి, జూపల్లి, తమ లక్ష్యం అందరిదీ ఒక్కటేనని చెప్పారు. వీరిద్దరు సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కుటుంబ పరిపాలన అంతమొందించాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారని చెప్పారు. ప్రధాని వాగ్ధానం నెరవేర్చాల్సిన బాధ్యత అమిత్ షా, జేపీ నడ్డాలపై ఉందన్నారు. అధిష్టానం ఆదేశాలతోనే వీరిని కలిశామని, కేసీఆర్ నిరంకుశ పాలనను బొంద పెట్టే పార్టీ బీజేపీ మాత్రమే అన్నారు. బీజేపీలో చేరాలని వారిని కోరినట్లు చెప్పారు. కేసీఆర్ డబ్బు సంచులతో కొనే ప్రయత్నం చేస్తున్నారని, కానీ అవి చెల్లవన్నారు.