తన సొంత జిల్లా చిత్తూరులో కీలకమైన తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం రాజకీయాలపై చంద్రబాబు అనూహ్య నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ నుంచి పార్టీ తరఫున వాయిస్ వినిపిస్తున్న మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మకు చెక్ పెట్టేందుకు ఆయన నిర్ణయించుకున్నట్టు పార్టీలో ప్రచారం జరుగుతోంది. 2014లో ఇక్కడ నుంచి గెలిచిన వెంకటరమణ.. అకాల మరణం చెందారు. దీంతో 2015లో వచ్చిన ఉప ఎన్నికల్లో ఆయన సతీమణి సుగుణమ్మ .. పోటీ చేసి విజయం దక్కించుకున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. గత ఎన్నికల్లో పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత.. ఆమె సైలెంట్ అయిపోయారు.
మరీ ముఖ్యంగా చంద్రబాబు ఇస్తున్న పోరాట పిలుపులకు కూడా ఆమెస్పందించడం లేదు. దీంతో ఆమెను మార్చాలనే డిమాండ్లు ఓ వర్గం టీడీపీ నేతల నుంచి వినిపిస్తోంది. దీనిపై దృష్టి పెట్టిన చంద్రబాబు.. తన సన్నిహితుడు జయరామిరెడ్డి సతీమణి రజనీకి బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల పార్టీ పదవుల విషయంలో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ.. కొందరి పేర్లను సూచించారు. అయితే, ఆమె సూచించిన వారిని పక్కన పెట్టిన చంద్రబాబు.. జయరామి రెడ్డి వర్గానికి ప్రాధాన్యం పెంచారు. ప్రధాన కార్యదర్శి పదవిని రజనీకి ఇవ్వడం వెనుక సుగుణమ్మను తప్పిస్తారనే ప్రచారం సాగుతోంది.
ఈ విషయంపై సుగుణమ్మ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. పార్టీ కోసం తాము ఆస్తులు అమ్ముకున్నామని.. తన భర్త ఆరోగ్యం కూడా దెబ్బతిని.. మరణించారని.. ఇంత చేస్తే.. తమను ఇప్పుడు పార్టీ నుంచి బయటకు పంపేలా అడుగులు వేయడం దారుణమని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఇప్పుడు ఆమె ఆవేదనను వినే నాథుడు లేకపోవడం గమనార్హం.
కొన్నాళ్లుగా రజనీ కనుసన్నల్లోనే ఇక్కడి కేడర్ పనిచేస్తుండడం.. ఇప్పుడు చంద్రబాబు సైతం ఆమెకు పార్టీలో ప్రధాన కార్యదర్శి పదవిని అప్పగించడం వంటి పరిణామాలతో సుగుణమ్మ హవా దాదాపు తగ్గిపోయింది. వచ్చే ఆరు నెల్లలో.. నియోజకవర్గం ఇంచార్జ్‌ల ప్రకటన ఉన్న నేపథ్యంలో తిరుపతి టీడీపీలో కీలక మార్పులకు బాబు శ్రీకారం చుట్టడం ఖాయమని.. సుగుణమ్మకు ఇక, శ్రీముఖమేనని అంటున్నారు పరిశీలకులు.