ఏ నాయకుడికైనా సొంత జిల్లాలో పార్టీ పరుగులు పెట్టాలని ఉంటుంది. దీనికి గాను ఏం చేయడానికైనా ముందుకు వస్తారు. అదేం చిత్రమో.. కానీ, ఏం చేసినా.. టీడీపీ మాత్రం పార్టీ అధినేత చంద్రబాబు సొంత జిల్లాలో సైకిల్ పరుగులు తీయనని అంటోంది. తాజాగా ఇక్కడ ముందుచూపుతో చంద్రబాబు ఆపరేషన్ బాగానే చేశారు. తిరుపతి, రాజంపేట, చిత్తూరు పార్లమెంటరీ జిల్లాల ఇంచార్జ్‌లను నియమించారు. అయితే, ఇలా నియామకం పొందిన ముగ్గురూ కూడా కొత్తవారే కావడంతో వారు ఏమేరకు పుంజుకుంటారు? అనేది కీలక అంశంగా మారింది. అసలే ఇబ్బందుల్లో ఉన్న పార్టీని కొత్త మొఖాలు పరిగెట్టిస్తాయా? అనేది సందేహం.
తిరుపతి: ఈ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడిగా తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ మాజీ చైర్మన్ నరసింహయాదవ్‌ను చంద్రబాబు నియమించారు. ఈయనపై చాలానే ఆశలు పెట్టుకున్నారు. కానీ, ఈయన తిరుపతికి చెందిన నాయకుడే అయినప్పటికీ.. జిల్లా వ్యాప్తంగా తెలిసినప్పటికీ.. మరికొన్నాళ్లకి తిరుపతి ప్రత్యేక జిల్లా అయితే దాని పరిధిలోకి నెల్లూరు జిల్లాకు చెందిన సూళ్ళూరుపేట, గూడూరు, వెంకటగిరి, సర్వేపల్లి నియోజకవర్గాలు చేరుతాయి. ఆ ప్రాంత ప్రజలకు, టీడీపీ శ్రేణులకు నరసింహయాదవ్ కొత్త. దీంతో ఈయన ఎలా పుంజుకుంటారు? అనేది కీలక అంశం. పైగా ఆయా నియోజకవర్గాల్లో రెడ్డి వర్గం డామినేషన్ ఎక్కువగా ఉంది.
రాజంపేట: సగం చిత్తూరు, సగం కడప జిల్లాల పరిధిలోకి వచ్చే ఈ నియోజకవర్గం పార్లమెంటరీ అధ్యక్షుడిగా కడప జిల్లాకు చెందిన రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డిని నియమించారు. ఈ నియోజకవర్గం పరిధిలోకి రాజంపేట, కోడూరు, రాయచోటి, తంబళ్ళపల్లె, మదనపల్లె, పీలేరు, పుంగనూరు అసెంబ్లీ సెగ్మెంట్లు వస్తాయి. ఇక, రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి జిల్లా వాసులకు కొత్త. కానీ అధ్యక్షుడుగా నియమితులైనందున కొత్త జిల్లా ఏర్పడే లోపు ఈ ప్రాంత పార్టీ శ్రేణులకు పరిచయం అవుతారని అధినేత తలపోస్తున్నట్టు తెలుస్తోంది. కొత్త అధ్యక్షులు కొత్త ప్రాంతాల్లో పర్యటించి గ్రామ, మండల, పట్టణ, నగర, నియోజకవర్గాల కమిటీలను నియమించడం ద్వారా ఆ ప్రాంతాలపై పట్టును పెంచుకోవాలి. కానీ, ఇది సాధ్యమేనా? పైగా సీఎం జగన్‌కు కంచుకోట వంటి జిల్లాలో దూకుడు పెంచేనా. చూడాలి.
చిత్తూరు: ఈ పార్లమెంటు నియోజకవర్గం ఇంచార్జ్‌గా పులివర్తి నానికి బాధ్యతలు అప్పగించారు. చిత్తూరు పార్లమెంటు పరిధిలో చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం సహా కీలక నియోజక వర్గాలున్నాయి. ప్రస్తుత జిల్లా అధ్యక్షుడిగా వున్న ఉనన పులివర్తి నానికి జిల్లా అంతటా విస్తృత పరిచయాలు న్నాయి. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రగిరి కూడా దీని పరిధిలోనే ఉంది. పార్లమెంటు పరిధిలో మాజీ మంత్రి అమరనాథరెడ్డి, ఎమ్మెల్సీలు గౌనివారి శ్రీనివాసులు, దొరబాబు వంటి సీనియర్లున్నా వారు చాలా ఏళ్ళ కిందటే జిల్లా అధ్యక్షులుగా పనిచేశారు. మిగిలిన వారిలో విస్తృత పరిచయాలు, చొరవగా శ్రేణులను కలుపుకుపోగలిన నాయకుడు నానీ మా త్రమేనని బాబు భావిస్తున్నారు. మరి ఈయన దూకుడు పెంచితే మంచిదేనని అంటున్నారు మరి ఏం చేస్తారో చూడాలి.
-vuyyuru subhash