టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు రిమాండ్ గడువును ఏసీబీ న్యాయస్థానం ఆదివారం పొడిగించింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును సీఐడీ రెండు వారాల క్రితం అరెస్ట్ చేసింది. నేటితో రిమాండ్ ముగియడంతో వర్చువల్‌గా ఏసీబీ న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. దీంతో న్యాయమూర్తి ఆయన రిమాండ్‌ను అక్టోబర్ 5వ తేదీ వరకు అంటే మరో 11 రోజులు పొడిగించారు. ఈ నేపథ్యంలోనే.. మీ బెయిల్ పిటిషన్‌ను రేపు సోమవారం విచారిస్తున్నామని చంద్రబాబుతో ఏసీబీ న్యాయమూర్తి చెప్పారని తెలుస్తోంది.
ఈ రోజు కస్టడీ, రిమాండ్ ముగిసిన నేపథ్యంలో సీఐడీ అధికారులు… చంద్రబాబును వర్చువల్‌గా న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. రెండురోజుల కస్టడీ ముగియడంతో విచారణ అధికారులను అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు. అనంతరం న్యాయమూర్తి మాట్లాడుతూ రేపు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరుపుతున్నట్లు చెప్పారని తెలుస్తోంది. విచారణ సమయంలో వైద్య పరీక్షలు నిర్వహించారా? ఏమైనా ఇబ్బంది పెట్టారా? అని న్యాయమూర్తి ప్రశ్నించారు. వైద్య పరీక్షలు నిర్వహించారని, తనను ఏవిధంగా ఇబ్బంది పెట్టలేదని చెప్పారు. ఈ సందర్భంగా చంద్రబాబును ఉద్దేశించి జడ్జి మాట్లాడుతూ… రేపు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరుపుతామన్నారు. విచారణ సందర్భంగా ఏం గుర్తించారో బయట పెట్టాలని ఈ సందర్భంగా చంద్రబాబు విజ్ఞప్తి చేయగా, న్యాయమూర్తి స్పందిస్తూ… వివరాలకు సంబంధించిన డాక్యుమెంట్స్‌ను మీ న్యాయవాది నుంచి తీసుకోవాలని జడ్జి సూచించారు.