దేశ రాజధాని ఢిల్లీ ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి ఊహించని విధంగా షాక్ తగిలింది. ఎలా అయినా సరే ఢిల్లీ పీఠం గెలవాలని భావించిన కమలం పార్టీకి అరవింద్ కేజ్రివాల్ ఊహించని విధంగా షాక్ ఇచ్చారు. దాదాపు 60 స్థానాల్లో ఆప్ ఏకపక్ష విజయం సాధించింది. ఢిల్లీ నలుమూలలా కూడా ఆప్ తన సత్తా చాటింది. బిజెపి వ్యూహాలను సమర్ధవంతంగా తిప్పి కొట్టింది.
జాతీయ వాదంతో ప్రజల్లోకి వెళ్ళిన బిజెపికి అరవింద్ కేజ్రివాల్ పరిపాలన చుక్కలు చూపించింది. తనకు ఇచ్చిన అధికారాన్ని ఆయన ప్రజల కోసం సద్వినియోగం చేసారు. ప్రజల్లో ఉండటంతో పాటుగా పరిపాలనలో ఆయన తీసుకున్న నిర్ణయాలు దేశ రాజధాని ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. దీనితో వరుసగా మూడో సారి ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రివాల్ నిలిచారు.
దీనితో ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఆ పార్టీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అరవింద్ కేజ్రివాల్ కి ధన్యవాదాలు చెప్పడమే కాకుండా ఢిల్లీ ప్రజలు దేశ ఆత్మను కాపాడారు అంటూ వ్యాఖ్యానించారు. ఇక ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరవింద్ కేజ్రివాల్ కి ఫోన్ చేసిన అభినందనలు తెలిపారు. అదే విధంగా పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీ కూడా ఫోన్ చేసారు.
అటు కాంగ్రెస్ నేతలు కూడా ఆప్ కి ధన్యవాదాలు తెలిపారు. ఏకపక్ష విజయం సాధించింది ఆప్ అంటూ కొనియాడుతున్నారు. ఎన్నికల ముందు నుంచి కూడా అరవింద్ కేజ్రివాల్ గెలుస్తారు అంటూ సోషల్ మీడియాతో పాటు పలు సర్వేలు వెల్లడించాయి. అందరూ అనుకున్నట్టు గానే ఢిల్లీని మళ్ళీ ఆప్ కైవసం చేసుకుంది. 53 శాతం పైగా ఓట్లు సాధించి చరిత్ర సృష్టించింది ఆప్.