శ్రీలంకలో ఉన్న దుర్భర పరిస్థితులు ఏపీలో ఇప్పటికే ఉన్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన మీడియాతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందుకు ఎన్నో ఉదాహరణలున్నాయని చంద్రబాబు అన్నారు. అంతేకాకుండా పనిచేసే ఉద్యోగులకు ఎప్పటి నుంచో సకాలంలో జీతాలు చెల్లించట్లేదు, తమ జీపీఎఫ్ ఖాతాల నుంచి డబ్బులను విత్ డ్రా చేసుకునే పరిస్థితుల్లో ఉద్యోగులు లేరని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
అంతేకాక పదవీ విరమణ చేసిన వారికివ్వాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడం లేదని, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించే పరిస్థితి లేదని చంద్రబాబు విమర్శించారు. చేసిన అప్పులకు వడ్డీలు కట్టేందుకు కొత్త అప్పులు చేస్తున్నారని, మూలధన వ్యయం లేదని, రహదారులకు మరమ్మతులు లేవని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవన్నీ శ్రీలంక లాంటి
పరిస్థితులు కావా..? అని ఆయన ప్రశ్నించారు. పోలవరం నిర్లక్ష్యం ఎవరిదో కేంద్రమే నిర్ధారించిందని, రాష్ట్ర ప్రభుత్వం పోలవరం విషయంలో తమ వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకు ఎదురుదాడి చేస్తోందన్నారు.