మరోసారి సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు టీడీపీ అధినేత చంద్రబాబు. కుప్పం నియోజకవర్గం ఇతర నియోజకవర్గాలకు ఆదర్శంగా ఉండాలని తాను భావించేవాడినని వెల్లడించారు చంద్రబాబు. కుప్పం ఒక ప్రశాంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని ప్రయత్నించానని చంద్రబాబు తెలిపారు. తాజాగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఇక్కడ పోలీసు స్టేషన్, కోర్టులు, జైళ్ల అవసరం రాకూడదు అనుకునేవాడిని. అలాంటి నియోజకవర్గంలో ఇప్పుడు ఈ వైసీపీ దుర్మార్గులను ఎదుర్కోవడానికి నేనే లాయర్లు వెతుక్కునే పరిస్థితి వచ్చింది. కుప్పంలో 70 మందిని అరెస్టు చేసి 20 రోజులు జైళ్లలో పెట్టారు. మనం ఒక సైకోను ఎదుర్కొంటున్నాం.
ఇలాంటి సైకోలను కట్టడి చేయాలంటే తెలుగుదేశం నాయకులు ప్రజల సమస్యలపై అత్యంత చురుగ్గా పనిచేయాలి” అని చంద్రబాబు పిలుపునిచ్చారు. తాను విద్యార్థిగా ఉన్న రోజుల నుంచి ఐపీసీ సెక్షన్లు చదువుకోవాల్సిన అవసరం రాలేదని, కానీ, జగన్ రెడ్డి చట్టవ్యతిరేక పాలన కారణంగా నేడు వాటిని తెలుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని చంద్రబాబు పేర్కొన్నారు. 175 నియోజకవర్గాలలో లీగల్ టీంలు పనిచేస్తున్నాయని, కార్యకర్తలు భయపడాల్సిన పనిలేదని వెల్లడించారు. “ప్రతి నియోజకవర్గంలో లీగల్ టీంలు లీగల్ స్క్రూటినీ చేసి కార్యకర్తలకు న్యాయపరమైన సహాయం అందించాలి. 27 దళిత పథకాలను రద్దు చేసిన జగన్ రెడ్డిని ప్రశ్నించినందుకు గుడివాడలో ఒక మహిళపై కేసు పెట్టి అరెస్టు చేశారు. ఇది చాలా దుర్మార్గం” అని పేర్కొన్నారు చంద్రబాబు.