గతంలో రాష్ట్ర విభజన సమయంలో టీడీపీ వ్యవహరించిన తీరుపై ఉమ్మడి రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేవారు. టీడీపీ ద్వంద్వ వైఖరిని అవలంబిస్తోందని, రెండు కళ్ల సిద్ధాంతాన్ని ఆ పార్టీ అధినేత చంద్రబాబు తీసుకున్నారని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రభావం అటు చంద్రబాబుపైన, ఇటు ఆ పార్టీపైనా కూడా తీవ్రంగా పడింది. ఇక, ఇప్పుడు చంద్రబాబు సొంత రాష్ట్రం ఏపీలోనూ ఇదే తరహా ప్రభావం పడుతోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రాజధాని అమరావతి విషయంలో చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరిని రాజధాని ప్రజల్లోని ఓవర్గం తీవ్రంగా తప్పుపడుతోంది.
అమరావతిని తరలిస్తున్నామంటూ.. జగన్ ప్రకటించిన తర్వాత.. ఇదే కావాలంటూ.. టీడీపీ నేతలు.. ఇక్కడ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. రైతులను ఆందోళనల దిశగా ప్రోత్సహించారు. దీంతో ఇది నిజమేనని అనుకున్న రాజధాని ప్రజలు.. టీడీపీతో కలిసి పోరు కొనసాగించారు. అయితే, విశాఖను పాలనా రాజధానిగా జగన్ ప్రకటించిన తర్వాత.. అక్కడ రాజధాని వద్దని ఇక్కడి నాయకులు అంటున్నారే తప్ప.. అక్కడ గెలిచిన టీడీపీ నేతలు కానీ, శ్రేణులు కానీ ఆందోళన చేసింది లేదు. తాజాగా మూడు రాజధానుల బిల్లును గవర్నర్ ఆమోదించడంపై రాష్ట్ర వ్యాప్త నిరసనలకు చంద్రబాబు పిలుపునిచ్చారు.
దీనికి ఉత్తరాంధ్ర మినహా .. రాష్ట్ర వ్యాప్తంగా నేతలు ఆందోళన చేశారు. ఉత్తరాంధ్రలో మాత్రం.. ఎవరూ ముందుకు రాలేదు. మరి అక్కడ చంద్రబాబు మాటను ఆయా నేతలు విస్మరించారని అనుకోవాలా? లేక జగన్ నిర్ణయానికి కట్టుబడి ఉన్నారని అనుకోవాలా? ఈ రెండింటిలో ఏది జరిగినా.. ఆయా నేతలపై చంద్రబాబు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ, ఉలుకూ పలుకూ లేకుండా బాబు వ్యవహరిస్తున్నారు. అంటే.. ఆయన మౌనం వెనుక.. అమరావతిలో ఒకరకంగా ఉత్తరాంధ్రలో ఒకరకంగా వ్యవహరించాలనే వ్యూహం ఉందని అంటున్నారు పరిశీలకులు. ఇదే విషయం రాజధానిలోనూ చర్చనీయాంశంగా మారింది. మరోసారి చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం తెరమీదికి తెచ్చారని అంటున్నారు.