అవును! ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం పార్టీకి చెందిన సీనియర్లు, కీలక తమ్ముళ్లు ఇప్పుడు ఇలాగే ఆలోచిస్తున్నారు. ఎవరికి ఎవరు ఫోన్ చేసుకున్నా.. అచ్చు ఇలానే మాట్లాడుతూ.. తలలు బాదుకుంటున్నారు. ఇవన్నీ చూస్తే.. బట్టతల వచ్చాక దొరికే దువ్వెన! అని అనుకోక తప్పడం లేదు. ఇంతకీ విషయం ఏంటంటే.. రెండో ఏడాదిలోకి ప్రవేశించిన వైసీపీ అధినేత, సీఎం జగన్.. తన పాలనలో కీలక అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకు అనేక పథకాలు ప్రవేశపెట్టారు. ప్రజలకు అంటే.. పేదవారికి, అర్హులైన వారికి డబ్బులు పంచారు. సాధారణంగా ఇది గతంలోనూ చంద్రబాబు ప్రభుత్వంలో పసుపు-కుంకం.. ఉప్పు-కారం అనే పేర్లతో ప్రవేశపెట్టి డబ్బులు పంచారు.
అదేసమయంలో రాజధాని అంటూ.. ప్రపంచం మొత్తం తిరిగారు. ల్యాండ్ పూలింగ్ చేశామని, ఇది ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ ప్రభుత్వమూ సాధించలేదని ప్రచారం చేసుకున్నారు. ఇక, పార్టీలోనూ ప్రచార కార్యక్రమాలకు భారీ ఎత్తున నిధులు కేటాయించా రు. అన్నింటికన్నా ఎక్కువగా.. పార్టీలో అధినేత, అప్పటి సీఎం చంద్రబాబును విజన్ ఉన్న నాయకుడిగా ప్రొజెక్ట్ చేసేందుకు పెద్ద ఎత్తున కసరత్తు చేశారు. బాబు ఉన్నారు కాబట్టి.. ఏపీ ఇలా ఉందంటూ.. ప్రచార జోరు హోరెత్తింది. ఇలా ఐదేళ్లు గడిపేశారు. అయితే, గత ఏడాదిపాలన ప్రారంభించిన జగన్.. అనేక పథకాలను.. అంటే టీడీపీ నేతల మస్తిష్కాలకు సైతం అందని పథకాల ను, కార్యక్రమాలను తీసుకువచ్చారు. వీటిలో కీలకమైంది.. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ.
ప్రభుత్వ పాలనను నేరుగా ప్రజల వద్దకు తీసుకు వెళ్లే ఈ వ్యవస్థకు దేశంలోనే మంచి గుర్తింపు వచ్చింది. దీంతో టీడీపీ నేతలు, అధినేత సహా నాలిక కరుచుకున్నారు. అరరే.. మనమే ఈ కార్యక్రమం అమలు చేసి ఉంటే.. బాగుండేది కాదా.. పనికిమాలిన జన్మభూమిని పట్టుకుని వేలాడాం! అని ఏడాది కిందటే అనుకున్నారు. ఇక, ఆ తర్వాత జగన్ ప్రవేశ పెట్టిన పథకాలను లైట్ తీసుకున్నారు. దీనికి కారణం.. ఎలాగూ తాము వేరే వేరే పేర్లతో వాటిని అమలు చేశారు కాబట్టి! ఇక, ఇప్పుడు తాజాగా జగన్ తీసుకువచ్చిన మరో కీలక కార్యక్రమం.. సమయానికి ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరే విధంగా పది రోజుల్లో పింఛను, 20 రోజుల్లో ఆరోగ్య శ్రీ కార్డు, 90 రోజుల్లోనే అర్హులైన ఇళ్లు..
ఇలా ఒక్కొక్క పథకానికి టైం బౌండ్ పెట్టి మరీ అమలు చేసేందుకు వీలుగా కార్యక్రమాన్ని రూపొందించారు. ఇది కనుక సక్సెస్ అయితే, ప్రభుత్వంపై ప్రజలకు అపారమైన నమ్మకం ఏర్పడుతుందనడంలో సందేహం లేదు. ఇది వస్తే.. ఇక, ఏపీ కూడా కేరళ(అక్కడ కూడా ఇలాగే.. చెప్పిన టైం ప్రకారం ప్రభుత్వం పనులు చేస్తుంది. అవినీతి రహితంగా) మాదిరిగా అవుతుందని టీడీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఎవరికి ఎవరు ఫోన్లు చేసుకున్నా.. అరరే..ఈ థాట్ మనకు అప్పుడే ఎందుకు రాలేదు చెప్మా! అంటూ.. ఉప్మా కబుర్లు చెప్పుకొంటున్నారు.