రాష్ట్రంలో దూకుడు రాజకీయాలు చేస్తామని ప్రతిజ్ఞ చేసిన జనసేన పార్టీ.. ఇప్పుడు చతికిల పడింది. గత ఏడాది ఎన్నికల్లో ఘో రంగా దెబ్బతింది. అయితే, అప్పుడప్పుడు మీడియా ముందుకు వచ్చి.. అప్పటి పరిస్థితిపై అంతో ఇంతో మాట్లాడడం, విమర్శ లు చేయడం పార్టీ అధినేత పవన్ అనుసరిస్తున్న వైనం అన్న సంగతి తెలిసిందే. తాజాగా టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి అచ్చన్నను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో ఉదయాన్నే జరిగిన ఓ చానెల్ డిబేట్లో జనసేనకు చెందిన ఓ నాయకుడు పాల్గొన్నాడు. అచ్చన్నపై విమర్శలు గుప్పించారు. అవినీతి చేసిన వారు ఎంతటి వారైనా అరెస్టు చేయాల్సిందేనని చెప్పారు.
అంతటితో ఆగకుండా.. మా నాయకుడు(పవన్) లైన్ కూడా ఇదేనని చెప్పారు. దీంతో అందరూ అబ్బో.. అనుకున్నారు. కానీ, ఇంతలోనే ఏం జరిగిందో.. జనసేన పూర్తిగా సైలెంట్ అయిపోయింది. ఉదయం అంత సీరియస్‌గా అరెస్టు చేయాల్సిందే.. అన్న సదరు నాయకుడు సాయంత్రానికి ప్లేట్ ఫిరాయించారు. నిజానిజాలు తెలుసుకోకుండా జగన్ ప్రభుత్వం ప్రతిపక్షాన్ని టార్గెట్ చేసిందని ఓప్రకటన జారీ చేశారు. దీంతో ఈ విషయాన్ని ఫాలో అవుతున్న వారంతా కూడా ఒక్కసారిగా అవాక్కయ్యారు. అరె.. ఇంతలోనే ఏం జరిగిందని ఆరా తీయడం ప్రారంబించారు. టీడీపీ కీలక నేత అచ్చన్న విషయంపై జనసేన ఇంతలోనే అలా యూటర్న్ ఎందుకు తీసుకుందా? అని అందరూ ఆలోచించారు.
ఈ క్రమంలో తెలిసిన అసలు విషయం ఏంటంటే.. టీడీపీ అధినేత చంద్రబాబు రంగంలోకి దిగారు. హైదరాబాద్‌లోనే ఉన్న బాబు.. పవన్‌కు ఫోన్ చేశారని, విమర్శలు తగ్గించేలా చూడాలని, పార్టీలకు అతీతంగా మానవీయ కోణంలో వ్యవహరించాలని.. విషయా న్ని పెద్దది చేయడం వల్ల అధికార పక్షానికి మద్దతిచ్చినట్టు అవుతుందని చెప్పారట. అంతే.. పవన్ నుంచి నేరుగా ఏపీ నేతలకు పోన్ వచ్చింది. ఎవరూ కూడా అచ్చన్న విషయంపై మాట్లాడరాదని హుకుం జారీ చేశారు. దీంతో అందరూ మౌనం పాటించేస్తు న్నారు. దీంతో ఎన్నికల కు ముందు కొట్టుకున్నా.. తిట్టుకున్నా.. బాబు-పవన్‌లు ఇద్దరూ సమయోచితంగా రాజకీయాలు చేస్తున్నారే.. అనేకామెంట్లు సోషల్ మీడియాలో వెల్లువెల్లువెత్తుతున్నాయి. మరికొందరు.. జనసేనను బాబు మేనేజ్ చేస్తున్నారని అంటున్నారు.