ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భేటీకి ఆహ్వానించకపోవడంపై సోషల్ మీడియా తో పాటుగా పలు రాజకీయ పార్టీలు కీలక వ్యాఖ్యలు చేస్తున్నాయి. సోషల్ మీడియాలో దీనిపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు పలువురు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ట్రంప్ కార్యక్రమానికి జగన్ ని ఎందుకు పిలవలేదో చంద్రబాబు చెప్పారు.
ఆర్థిక నేరగాడు కాబట్టే ట్రంప్ పర్యటనకు జగన్‌ను పిలవలేదని చంద్రబాబు ఎద్దేవా చేసారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు చంద్రబాబు. టీడీపీ హయాంలో ఎన్నో పరిశ్రమలు వచ్చాయని, వైసీపీ హయాంలో అవన్నీ వెనక్కి వెళ్లిపోతున్నాయని, జగన్ మూర్ఖుడిగా, సైకో లాగా మారిపోయారని, తనపై కక్షతో కుప్పంకు నీళ్లు రానివ్వకుండా చేస్తున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. చిత్తూరు జిల్లా కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు.
సాగు, తాగునీటి ప్రాజెక్టులన్నింటినీ ఆపేశారన్న ఆయన, మీడియాపైన కేసులు పెట్టిస్తున్న ఒకే ఒక వ్యక్తి జగన్ అని, సోషల్ మీడియాతో టీడీపీపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. త్వరలో నారా లోకేష్ కుప్పంలో పర్యటిస్తారన్న ఆయన, ప్రజా సమస్యలపై పోరాటాన్ని కుప్పం నుంచే ప్రారంభిస్తామని స్పష్టం చేసారు. అమరావతి, అభివృద్ధి కోసం యువత పోరాడాలని, వైసీపీ కార్యకర్తల దాడులకు భయపడవద్దని సూచించారు. తప్పుడు కేసులు పెడితే సంఘటితంగా పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు.