‘సేవ్ ఏపీ..సేవ్ అమరావతి’ పేరుతో టీడీపీ ఎమ్మెల్యే గద్దె రాంమోహన్ నల్ల చొక్కా ధరించి 24 గంటల రిలే నిరాహారదీక్ష ప్రారంభించారు. ఆయన చేపట్టిన దీక్షకు ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చంద్రబాబు విద్యార్థులపై కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి కోసం విద్యార్థుల బయటకు రాకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ అంశంపై విద్యార్థులు బయటకు వచ్చి పోరాడరా ? అని ప్రశ్నించారు. విద్యార్థులు ఇంట్లో ఉంటే… తాము పోరాటం చేయాలా ? అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అలాగే తనపై కోపంతో అమరావతిని నాశనం చేయొద్దని అన్నారు.
సీఎం మంత్రులు రోజుకో మాట మాట్లాడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. రాజధాని ఏ ప్రాంతంలో పెట్టాలో శివరామకృష్ణ కమిటీ చెప్పిందని అన్నారు. తాను ఏ అధికారిని ఎప్పుడూ కించపరచలేదని… అందరిని గౌరవిస్తానని వివరించారు. లేని సమస్యతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని జగన్ తీరును తప్పుబట్టారు. అన్ని రాజకీయ పార్టీలు జేఏసీగా కలిసిరావాలని చంద్రబాబు కోరారు. జగన్ చరిత్ర హీనుడిగా మిగిలిపోతారని అన్నారు. రాయలసీమ ప్రజలకు విశాఖ చాలా దూరమని చంద్రబాబు తెలిపారు. అమరావతి జేఏసీలకు ప్రజలే విరాళాల ఇవ్వాలని చంద్రబాబు కోరారు