ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా అమరావతినే కొనసాగించాలి అంటూ తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది. రాజకీయంగా బలహీనంగా ఉన్నా సరే అమరావతి విషయంలో చంద్రబాబు వెనక్కు తగ్గే అవకాశాలు కనపడటం లేదు. తనను నమ్మి భూములు ఇచ్చిన రైతుల కోసం అమరావతిని కాపాడతా అని, రాష్ట్రం కోసం అమరావతిని కాపాడతాను అంటూ చంద్రబాబు పదే పదే చెప్తూ వస్తున్నారు.
అయితే తెలుగుదేశం పార్టీ భూముల కోసమే రాజధాని మార్పుని వ్యతిరేకిస్తుందని వైసీపీ నేతలు అంటున్నారు. ఇప్పటికే చంద్రబాబు రాజధాని రైతుల తరుపున పోరాటం కూడా మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఇక ఆయనకు తోడు తెలుగుదేశం పార్టీ నేతలు కూడా పోరాటం పెద్ద ఎత్తున చేస్తున్నారు. తాజాగా ఆ పార్టీ ఎమ్మెల్యే నిమ్మలరామానాయుడు అమరావతి కోసం తన నియోజకవర్గంలో ఉద్యమం మొదలుపెట్టారు.
పాలకొల్లులో కుటుంబ సభ్యులతో సోమవారం నిరాహారదీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన నిమ్మల మాట్లాడుతూ రక్తం చిందించి అమరావతిని కాపాడుకుంటామని చెప్తూ , రైతులు రక్తంతో వేలి ముద్రలు వేశారు. ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే ఉద్యమాలు ఉధృతం చేస్తామని స్పష్టం చేసారు. రైతుల కన్నీటిలో సీఎం జగన్ కొట్టుకుపోవడం ఖాయమని ఆయన హెచ్చరించారు.