తాను ప్రతిష్టాత్మకంగా చేపట్టానని, రాజధానిని తరలించేందుకు వీల్లేదని నిన్న మొన్నటి వరకు టీడీపీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు చేసిన ప్రకటనలు ఇంకా ప్రజల చెవుల్లో వినిపిస్తూనే ఉన్నా యి. నిజమే! రాజధానిని సింగపూర్ చేయాలని, రాష్ట్రాన్ని సన్ రైజింగ్ స్టేట్ చేయాలని ఆయన కలలు కన్నారు. ఈ క్రమంలోనే కృష్ణా, గుంటూరు జిల్లా మధ్య అమరావతిని రాజధానిగా ఎంచుకున్నారు. అనేక గ్రాఫిక్కులు సృష్టించారు. రైతుల నుంచి 33 వేల ఎకరాలను పూలింగ్ సిస్టమ్‌లో తీసుకున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. తన హయాంలో ఒక్క పర్మినెంట్ భవనం కూడా చంద్రబాబు నిర్మించలేక పోయారు.
తాత్కాలికంగా మాత్రమే కొన్ని భవనాలను ఆయన ప్రభుత్వం నిర్మించింది. అయితే, కేవలం ప్రణాళికల రూపంలో వందల కోట్ల రూపాయలను ఆయన వెచ్చించారు. ఇవన్నీ అందరికీ తెలిసిందే. అయితే, గత ఏడాది ఇదే రాజధానిని చూపించి ఎన్నికల్లో గెలుపు గుర్రం ఎక్కాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమం లోనే తన కుమారుడిని కూడా రాజధాని నియోజకవర్గమైన మంగళగిరి నుంచి నిలబెట్టారు. కానీ, బాబు వ్యూహం అట్టర్ ఫ్లాప్ అయిపోయి. ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు.
ఇక, తర్వాత వచ్చిన జగన్ రాజధానిని మారుస్తానని ప్రకటించారు. దీంతో రాజధాని మార్చేందుకు వీల్లేదంటూ.. అసెంబ్లీలోనే జగన్‌కు దణ్నాలు పెట్టిన చంద్రబాబు.. బయటకు వచ్చాక ధర్నాలు చేశారు. ఇంత జరిగిన తర్వాత.. ఇప్పటికి రాజధాని ఉద్యమం సాగుతున్న సమయంలో చంద్రబాబు అకస్మాత్తుగా మాట మార్చారు. అమరావతి ఉద్యమానికి సంబంధించి 200 రోజులు పూర్తయిన నేపథ్యంలో తాజాగా మాట్లాడిన చంద్రబాబు.. భారం మొత్తాన్ని కేంద్రంపైకి నెట్టేశారు. `లా ఒక్కింతయు లేదు.. మీరే దిక్కు..` అంటూ.. ప్రధాని నరేంద్ర మోడీని రెచ్చగొట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మొత్తంగా 200 రోజుల ఫంక్షన్‌లో బీజేపీ నేతలను బాగానే ఇరికించారు. బీజేపీ నేతలతో రాజధానికి జై కొట్టించేందుకు వర్కవుట్ బాగానే చేశారు.
అయితే, వీరిలో కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి మాత్రం భూములను కొందరిని బెదిరించి తీసుకున్నారని విమర్శలు గుప్పించినా.. అంతిమంగా బాబు ట్రాప్‌లోకి చిక్కుకున్నారు. ఇక, కొందరు హిందూత్వ సంస్థల వారు ఏకంగా దక్షిణ అయోధ్య రామాలయం అమరావతిలోనే నిర్మిస్తామన్నారు. ఈ పరిణామాలు గమనించిన తర్వాత .. చంద్రబాబు బీజేపీని బాగానే ఇరికించారనే వాదనలు బలపడుతుండడం గమనార్హం.