ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ ఎంపీ వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి.. టీడీపీ, బీజేపీ నేతలపై విమర్శల ప్రశంసలు విస్తృతంగా వెదజల్లుతున్నారు. అంటే.. ఈ మధ్య ఆ విమర్శల దాడి కాస్తా.. కాస్త రూటు మార్చి ప్రశంసల వర్షంతో కూడుకొన్న విమర్శల వలె ఉండటం, అవి ఒక్కొక్కటి తీసి… ఎల్లో మీడియాలో తునకలు, తులకలుగా డిబేట్లు కొనసాగించడం వంటివి చూపరులను సంభ్రమాశ్చర్యాలకు లోను చేస్తున్నాయి.
తాజాగా టీడీపీ నేతలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇళ్ల స్థలాల పంపిణీ విషయంలో ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని.. అంతటితో ఆగకుండా కొందరు తప్పులు వల్లెస్తుంటే మరికొందరు.. గొనుక్కుంటున్నారని.. ఆరోపించారు. అదెలాగంటే… “నిర్మాణం పూర్తి కాని ఇళ్లను పంపిణీ చేయట్లేదని పచ్చపార్టీ ఆందోళనకు దిగడంపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు గారు కడిగి పారేశారు. బాబు ఎక్కడ హర్ట్ అవుతాడో అని కన్నా సైలెంటయ్యాడు. 30 లక్షల పట్టాలు సిద్ధమైనప్పటి నుంచి ‘విజనరీ’ చీకటి మిత్రులకూ టెన్షన్ పట్టుకుంది” అని విజయసాయిరెడ్డి తీవ్రంగా విమర్శనాస్త్రాలు సంధించారు.
అంతేకాకుండా “ఇళ్ల స్థలాల పంపిణీని అడ్డుకుని పేదలపై పగ సాధించడమే కాకుండా దొంగే దొంగ, దొంగ అని అరిచినట్టు నిరసన దీక్షలు చేస్తారట టీడీపీ(తెలుగు దొంగల పార్టీ)నేతలు. పట్టాల పంపిణీ వాయిదా వేయకుండా తక్షణమే అందజేయాలని డిమాండు. అడ్డుకునేది మీరే. ఇవ్వాలని అడిగేది మీరే. మరీ ఇంత సిగ్గు విడిచి రాజకీయం చేయాలా” అంటూ విజయ సాయిరెడ్డి టీడీపీనేతల ద్వంద్వ నాలుకల ధోరణిపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు.
అంటే… విజయసాయిరెడ్డి బాధ టీడీపీ వైఖరి పట్ల చాలా తీవ్రమైనదిగా వ్యక్తం చేశారు. ఇవ్వకపోతే ఇవ్వమని వాపోతుంటారు.. ఇస్తుంటేనేమో ఇవ్వకూడదని.. కోర్టులకెక్కి మరీ అడ్డుకొనే వ్యాపారం చేస్తుంటారు అంటూ విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాల్లోని నిగూఢార్థం. మరి ఈ విషయంపై ఎల్లో మీడియా ఈరోజు ఎలాంటి డిబేట్లు నిర్వహిస్తుందో.. జనాలకు ఏవిధంగా రసానందాన్ని కలిగింపజేస్తుందో వేచి చూడాలి!