షెడ్యూల్ రాకముందే తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికల్లో పోటీ చేసే పార్టీ అభ్యర్థిని ప్రకటించేశారు చంద్రబాబు. సీట్లు.. టికెట్ల విషయంలో నాన్చి నాన్చిగానీ తేల్చని టీడీపీ అధినేత.. ఈసారి ముందుగానే స్పష్టత ఇచ్చారు.చంద్రబాబు స్కూలులో ఎన్నికలు… అభ్యర్థుల ప్రకటన.. ఈక్వేషన్లు చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. నామినేషన్ల చివరి రోజు వరకూ అభ్యర్థి ఎవరో తేల్చరు. కానీ తిరుపతి ఉపఎన్నికల్లో ముందస్తుగా అభ్యర్ధి ప్రకటనలో మాత్రం బీజేపీకి చెక్ పెట్టే ప్యూహం ఉందట…
తిరుపతి లోక్‌సభకు జరగబోయే ఉపఎన్నికపై ఏపీలో క్రమంగా రాజకీయ వేడి రాజుకుంటోంది.
ఇంకా షెడ్యూల్ రాలేదు. కానీ.. బీజేపీ దూకుడు పెంచింది. తెలంగాణలో దుబ్బాక విజయంతో ఉత్సాహంగా ఉన్న బీజేపీ నేతలు ఇక్కడ కదనంలో కాలు దువ్వుతున్నారు. అభ్యర్థుల వేట సాగిస్తునే మరోవైపు తిరుపతిలో గ్రౌండ్‌వర్క్ మొదలుపెట్టేశారు కమలనాథులు. గత ఎన్నికల్లో కనీసం డిపాజిట్ కూడా తెచ్చుకోలేని బీజేపీ స్పీడ్ చూసిన చంద్రబాబు.. వెనకపడకూడదని భావించరో ఏమో.. ఏకంగా అభ్యర్థిని ప్రకటించేశారు. కిందటి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిన కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మినే మళ్లీ బరిలో దిగుతున్నట్టు ప్రకటించారు చంద్రబాబు.
చంద్రబాబు స్కూలులో ఎన్నికలు… అభ్యర్థుల ప్రకటన.. ఈక్వేషన్లు చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. నామినేషన్ల చివరి రోజు వరకూ అభ్యర్థి ఎవరో తేల్చరు. చాలా వడపోతలు, సుదీర్ఘ సమావేశాలు నిర్వహిస్తారు. ఆ విధానానికి తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలో బ్రేక్ వేశారు టీడీపీ అధినేత. దీనిపై పార్టీలో చర్చ కూడా మొదలైంది. వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ఆకస్మిక మరణంతో ఇక్కడ ఉపఎన్నిక రాబోతుంది. పోటీ వద్దని అధికారపార్టీ నుంచి ఎలాంటి వర్తమానం రాలేదని.. అందుకే అభ్యర్థిని ప్రకటించామన్నది టీడీపీ వాదన. ఇదే సమయంలో బీజేపీ పోటీకి సిద్ధమంటున్న తరుణంలో తాము ఎలా సైలెంట్‌గా ఉంటామని ప్రశ్నిస్తున్నారు టీడీపీ నేతలు.
సిట్టింగ్ సభ్యుడు చనిపోతే గతంలో పోటీ ఉండేది కాదు. కానీ నంద్యాల ఉప ఎన్నిక తర్వాత ఏపీలో సీన్ మారిపోయింది. వైసీపీ నుంచి గెలిచిన భూమా నాగిరెడ్డి తర్వాత టీడీపీలో చేరారు. ఆయన అకాల మరణంతో వచ్చిన ఉప ఎన్నికలో టీడీపీ, వైసీపీ రెండూ పోటీ చేశాయి. తమ పార్టీ గుర్తుపై గెలిచిన అభ్యర్థి చనిపోవడం వల్లే పోటీ చేశామని వైసీపీ వెల్లడించింది. ఇప్పుడు తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక విషయంలో అధికార పక్షం కంటే ముందు విపక్షాలు పోటీకి సై అంటున్నాయి.
తిరుపతి లోక్‌సభ పరిధిలో టీడీపీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. అందువల్ల ఈ బైఎలక్షన్ పార్టీకి అంతా ఈజీ కాదన్నది పార్టీ వర్గాల టాక్. అభ్యర్థిపై చర్చ జరిగిన సమయంలో ఎవరూ ముందుకు రాకపోవడం.. గతంలో పోటీ చేసి ఓడిన పనబాక లక్ష్మి ఆసక్తి చూపడటంతో చంద్రబాబు వెంటనే నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. గతంలోలా అభ్యర్థి విషయంలో నాన్చుడు ధోరణి అవలంభిస్తే ఇతర పక్షాలు ఎన్నికల ఫ్రేమ్‌లో ముందుకెళ్లే ఛాన్స్ ఉందని టీడీపీ అధినేత భావించారట. అలాంటి చర్చకు ఆస్కారం ఇవ్వకూడదనే అందరికంటే ముందుగా నిర్ణయం తీసుకున్నారట. చంద్రబాబు ఈక్వేషన్స్ ఏ మేరకు ఫలితాన్నిస్తాయో చూడాలి.