చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరిపై ప్రతిపక్ష పార్టీల్లో విస్మయం వ్యక్తమవుతోంది. టీడీపీ అధికాంలో ఉండగా.. ఆయన రాజకీయాలు చేశారు. ప్రతిపక్షాలతో జట్టుకట్టలేక పోయారు. ప్రతిపక్షాలను కలుపుకొని కూడా పోలేక పోయారు. సరే! అప్పుడు అయిపోయింది. కానీ, ఇప్పుడు పార్టీ బలహీన మవుతోంది. అయినా.. కూడా ఆయన విధానంలో ఎక్కడా మార్పు రాలేదని అంటున్నారు పరిశీలకులు. మాజీ సీఎంగా తాను ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అమరావతి రాజధాని విషయంలో ఆయన చేసిన ఆందోళనలను అన్నీ ఇన్నీ కావు. వాటికి ప్రతిపక్షాలను కలుపుకొని పోయారు.
చంద్రబాబుతో కలవని పార్టీలపై ఆయన శాపనార్థాలు కూడా పెట్టారు. ప్రజల గొంతు వినిపించాల్సిన ప్రతిపక్షాలు.. ప్రభుత్వానికి అనుకూలంగా మారాయంటూ.. జనసేనపై పరోక్షంగా విరుచుకుపడ్డారు. మొత్తంగా జగన్ సర్కారుపై చంద్రబాబు ఉద్యమం చేస్తే.. సీపీఐ, సీపీఎం వంటి పార్టీలు కలిసి వచ్చాయి. ఆయనతొ నడిచాయి. ఉద్యమాన్ని కొత్త పుంతలు తొక్కించాయి. మరి ఇప్పుడు చంద్రబాబు వంతు వచ్చింది. ఆయనే కీలకమైన ప్రాజెక్టుగా భావించిన పోలవరం విషయంలోనూ జగన్ సర్కారు అడ్డదారిలో వెళ్తోందని కొన్నాళ్లుగా విమర్శలు వస్తున్నాయి. పోలవరం ఎత్తును తగ్గించడం, పోలవరం ప్రాధాన్యం తగ్గిపోయేలా వ్యవహరించడం, కేంద్రం నిధులు తగ్గించినా.. మౌనంగా ఉండడం వంటివి జరుగుతున్నాయి.
అయితే.. దీనిపై అడపా దడపా మాత్రమే మాట్లాడుతున్న చంద్రబాబు పెద్దగా స్పందించడం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరోవైపు జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అయినా.. ఇప్పటి వరకు పోలవరంపై నిర్దిష్టంగా ఎలాంటి ముందడుగు వేయకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో కమ్యూనిస్టు పార్టీ అయిన సీపీఐ పోలవరం యాత్రకు పిలుపునిచ్చింది. చలో పోలవరం పేరుతో నిర్వహించిన యాత్ర ద్వారా.. ప్రజలకు వాస్తవాలను వివరించాలని ప్రయత్నించింది. ఈ కార్యక్రమం షెడ్యూల్‌ను ఆదివారం పెట్టుకున్నారు.
అయితే.. అనూహ్యంగా పోలీసులు ప్రభుత్వం కూడా ఈ యాత్రపై ఉక్కుపాదం మోపింది. సరే! ఇది వేరే సంగతి.. అయితే.. ఇప్పటి వరకు చంద్రబాబు వెంట నడిచి.. బాబుకు మద్దతుగా వ్యవహరించి.. అన్ని విషయాల్లోనూ ఆయనకు అనుకూలంగా వ్యవహరించిన సీపీఐకి మద్దతు ప్రకటించడంలో చంద్రబాబు విఫలమయ్యారనే వాదన బలంగా ఇప్పుడు వినిపిస్తోంది. కనీసం చంద్రబాబు పది మందిని టీడీపీ నేతలను కూడా ఈ యాత్రకు పంపకపోవడం.. విమర్శలకు అవకాశం ఇచ్చింది.
ఒకవేళ టీడీపీ నేతలు కూడా సీపీఐతో కలిసి యాత్ర చేస్తే.. సక్సెస్ అయితే.. ఆ క్రెడిట్.. తనకు దక్కకుండా పోతుందనే ఆవేదనతోనే బాబు ఇలా చేశారని పొలిటికల్ సర్కిళ్లలో చర్చకు వస్తుండడం గమనార్హం. మరి ఇలాంటి రాజకీయాలతో పార్టీ ఎదిగేనా? అనేది విమర్శకుల మాట! మరి బాబు ఏం చెబుతారో చూడాలి.