టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటన మూడవరోజు కొనసాగుతోంది. మూడవరోజు పర్యటనలో ఆయన కుప్పం నియోజకవర్గంలోని కృష్ణ నందనపల్లి, గుండ్ల నాయన పల్లి, కొత్తూరులోో పర్యటించనున్నారు. ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరించనున్నారు. చంద్రబాబు రెండవ రోజు కుప్పం పర్యటనలో కాన్వాయ్ పై వైసీపీ శ్రేణులు రాళ్లు విసిరే ప్రయత్నం చేశారు. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నప్పటికీ ఏపీ పోలీసులు ఏమాత్రం పట్టించుకోకపోవడంతో.. ఎన్ఎస్జి అప్రమత్తం అయ్యింది.
ఆయనకు భద్రతను భారీగా పెంచింది. గతంలో 8 మంది నేషనల్ సెక్యూరిటీ గార్డులు ఉండగా.. నేటి నుంచి అదనంగా మరో 20 మందిని నియమించారు. గతంలో డిఎస్పీ ర్యాంకు అధికారి పర్యవేక్షణలో భద్రతా సిబ్బంది విధులు నిర్వహించేవారు. ఇకపై డిఐజీ ర్యాంకు అధికారి పర్యవేక్షణలో పనిచేస్తారు. చంద్రబాబు భద్రతకు ముప్పు ఉందని ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగా ఎన్ఎస్జి డిఐజిజి భద్రతను సమీక్షించినట్టు సమాచారం.