చండీగఢ్: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌పై పోలీసులు ఛీటింగ్ కేసు నమోదు చేశారు. తనను మోసం చేశారని సల్మాన్‌తో పాటు ఆయన సోదరి అల్విరా ఖాన్ అగ్నిహోత్రి, మరో ఏడుగురు బీయింగ్ హ్యూమన్ ఉద్యోగులపై అరుణ్ గుప్తా అనే వ్యాపారి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు జూలై 13లోపు వివరణ ఇవ్వాలని సమన్లు జారీ చేశారు.
బీయింగ్ హ్యూమన్ సంస్థ ఫ్రాంచైజీని తెరవమని, ఆ సంస్థలో పెట్టుబడి పెట్టమని ఇద్దరు ఉద్యోగులు తనను అడిగారని, దాంతో రూ. 2 కోట్లు ఖర్చు పెట్టినట్లు అరుణ్ గుప్తా చెబుతున్నారు. షోరూమ్ తెరచిన ఏడాది అయినా సదరు సంస్థ నుంచి ఎలాంటి డబ్బులు తిరిగి రాలేదని తెలిపారు. ఈ విషయమై సల్మాన్ ఖాన్‌తో సమావేశం అయ్యేలా చూస్తామని, షోరూమ్ ప్రారంభానికి కూడా వస్తారని ఇద్దరు ఉద్యోగులు తనకు చెప్పినట్లు అరుణ్ గుప్తా పేర్కొన్నారు. అయితే ఇప్పటి వరకూ సల్మాన్ ఖాన్‌తో ఎలాంటి సమావేశాలు జరగలేదని, డబ్బులుపై ఆరా తీస్తే స్పందించడంలేదని అరుణ్ గుప్తా ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో చేసేదేమీలేక సల్మాన్, ఆయన సోదరి అల్విరా, సదరు సంస్థ సీఈవో ప్రకాశ్ కాపరే సహా ఏడుగురిపై తాను కేసు పెట్టినట్లు తెలిపారు.