ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన ఓ టీవీ ఛానెల్ డిబేట్‌లో మాట్లాడుతూ..ప్రధాని మోడీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒప్పందం చేసుకున్నారని.. ఢిల్లీలో ఇద్దరి మధ్య రహస్యంగా అగ్రిమెంట్ జరిగిందని ఆయన ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బెయిల్‌పై ఉన్నారు.. బీజేపీ తల్చుకుంటే ఏమైనా అవుతుందనే భయంతో చీకటి ఒప్పుందం చేసుకున్నారని ఆరోపించారు .
లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థులను గెలిపించడమే రేవంత్ రెడ్డి లక్ష్యమని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. బీజేపీపై కాంగ్రెస్ బలహీన అభ్యర్థులను పోటీ నిలబెడుతోందని ఆరోపించారు. అందులో భాగంగానే కరీంనగర్,చేవెళ్ల,మల్కాజిగిరి, సికింద్రాబాద్‌లో కాంగ్రెస్ బలహీన అభ్యర్థులను బరిలో దింపిందన్నారు. కడియం కావ్య ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తి అని అన్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కడియం కావ్యకు డిపాజిట్ కూడా రాదని బాల్క సుమన్ జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ గుర్తుపై గెలిచిన కడియం శ్రీహరి, దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవులకు రాజీమానా చేయాలని డిమాండ్ చేశారు.