కూల్డ్రింక్ అనుకుని ఐదేళ్ల చిన్నారి పురుగుల మందు తాగింది. గమనించిన తల్లిదండ్రులు ఆ చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అలా ఓ పది ఆస్పత్రులు తిరిగినా చివరకు చిన్నారిని దక్కించుకోలేకపోయారు. ఈ విషాద ఘటన కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని భీంపూర్ గ్రామంలో చోటుచేసుకుంది.
గ్రామానికి చెందిన రాజేశ్-లావణ్య దంపతులకు ఓ కుమారుడు, కుమార్తె శాన్వి ఉన్నారు. ఐదేళ్ల శాన్వి.. ఓ ప్రైవేట్ పాఠశాలలో ఎల్కేజీ చదువుతోంది. నిన్న ఆదివారం కావడంతో ఇంటి వద్ద ఆడుకుంటోంది. ఈ క్రమంలోనే ఇంటి ఆవరణలోని ఓ బాటిల్లో ఉన్న పురుగుల మందును కూల్డ్రింక్ అనుకుని తాగేసింది. తర్వాత ఇంటికి వచ్చిన చిన్నారి.. వాంతులు చేసుకోవడం గమనించిన కుటుంబసభ్యులు వెంటనే కాగజ్నగర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు.
అక్కడ వైద్యులు ఆస్పత్రిలో చేర్చుకోకపోవడంతో మంచిర్యాలకు వెళ్లారు. అక్కడా చిన్నారిని చేర్చుకోకపోవడంతో సుమారు మరో 10 ఆసుపత్రులు తిరిగారు. అయినా ఒక్కరూ చిన్నారిని ఆసుపత్రిలో చేర్చుకోలేదు. చివరకు ఓ ఆసుపత్రిలో చూపించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలపడంతో ఆ తల్లిదండ్రులు బోరున విలపించారు.