రెబల్​ స్టార్​ కృష్ణంరాజు మృతికి చిరు, పవన్ సంతాపం

-

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణం రాజు.. హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున 3.25 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.

ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఆయన మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తూ… ట్వీట్ చేశారు. “కృష్ణంరాజు గారు ఇక లేరు అనే మాట ఎంతో విషాదకరం. మా ఊరి హీరో, చిత్ర పరిశ్రమలో నా తొలి రోజుల నుంచి పెద్దన్నలా ఆప్యాయంగా ప్రోత్సహించిన కృష్ణంరాజుగారితో నాటి మనవూరి పాండవులు దగ్గర్నుంచి నేటి వరకు నా అనుబంధం ఎంతో ఆత్మీయమైనది. ఆయన ‘రెబల్​ స్టార్​’కు నిజమైన నిర్వజనం” అంటూ ట్విట్టర్ వేదికగా పోస్ట్ పెట్టారు.

ఇక ఆయన మరణంపై పవన్ కళ్యాణ్ కూడా తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు ‘‘తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక పంథాను కలిగిన నటులు కృష్ణంరాజు. రౌద్ర రస ప్రధానమైన పాత్రలను ఎంతగా మెప్పించేవారో కరుణ రసంతో కూడిన పాత్రల్లోనూ అలాగే ఒదిగిపోయేవారు. నటుడిగా, నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా అందరి మన్ననలు పొందిన ఆయన తుదిశ్వాస విడిచారనే వార్త దిగ్భ్రాంతి కలిగించింది. ఇటీవలి కాలంలో ఆయన అస్వస్థతకు లోనయ్యారని తెలిసినప్పుడు కోలుకొంటారనే భావించాను. కృష్ణంరాజు గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా. మా కుటుంబంతో కృష్ణంరాజు గారికి స్నేహసంబంధాలు ఉన్నాయి. 1978లో ‘మన వూరి పాండవులు’ చిత్రంలో ఆయనతో కలిసి అన్నయ్య చిరంజీవి నటించారు. మొగల్తూరు గ్రామవాసులు కావడంతో ఎంతో ఆప్యాయంగా ఉండేవారు. సినీ జీవితంలోనూ, ప్రజా జీవితంలోనూ ఎంతో బాధ్యతాయుతంగా వారు అందించిన సేవలు మరువలేనివి. కృష్ణంరాజు కుటుంబానికి నా తరఫున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను’’ అని ట్వీట్ చేశారు.ఆయన మరణంతో సినీలోకం శోకసంద్రంలో మునిగిపోయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version