ఇటీవల రెండు రోజుల కిందట సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లి వచ్చారు. దీనికి ముందు మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్‌లు కూడా ఢిల్లీ పర్యటన చేశారు. ఇది సాధారణమే అనుకున్నారు అందరూ.. కానీ.. అదేం చిత్రమో తెలి యదు కానీ.. ఈ పర్యటనలు ముగిసిన తర్వాత.. రాష్ట్ర వైసీపీ నేతల్లో ఎక్కడా లేని కొత్త ఉత్సాహం కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. సీఎం జగన్ ఢిల్లీ పర్యటన అనంతరం.. వరుసగా జరుగుతున్న పరిణామాలు.. వైసీపీ నాయకుల నోటి నుంచి వస్తున్న కామెంట్లు గమనిస్తే.. ఈ ఉత్సాహం నిజమేనని అనిపిస్తోంది. ఇంతకీ ఢిల్లీ పర్యటనకు ముందు.. తర్వాత విషయాలు చూద్దాం.
ఢిల్లీ పర్యటనకు ముందు మూడు రాజధానుల విషయంపై ఎవరూ నోరు ఎత్తే ప్రయత్నం చేయలేదు. కానీ, ఢిల్లీ పర్యటన ముగిం చుకున్నాక.. తాజాగా పార్టీ కీలక నేత, ఎంపీ విజయసాయిరెడ్డి విశాఖలో సంచలన కామెంట్లు చేశారు. మూడు రాజధానుల విషయంపై ఎవరితో మాట్లాడాలో వారితోనే మాట్లాడామని.. ఎవరితో చర్చించాలో మాకు తెలుసునని, విశాఖే రాజధాని అయి తీరుతుందని ధ్రుఢంగా చెప్పుకొచ్చారు. కానీ, ఇప్పటి వరకు ఎవరూ కూడా కనీసం సాయిరెడ్డితో సహా ఇలా మాట్లాడింది లేదు. ఇక, మరో కీలక విషయం ఏంటంటే.. ఇప్పటి వరకు హైకోర్టు నుంచి చీవాట్లు తింటున్న ప్రభుత్వానికి సుప్రీం కోర్టు రూపంలో భారీ రిలీఫ్ వచ్చింది.
ఇప్పటి వరకు రాష్ట్రంలో రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందో లేదో చూసి తీరుతామన్న హైకోర్టు దూకుడుకు సుప్రీం కోర్టు కళ్లెం వేసింది. ఇది కూడా జగన్ డిల్లీ పర్యటన తర్వాతే జరిగింది. మరో ముఖ్యమైన విషయం.. పోలవరం ప్రాజెక్టు అంచనాలను 55 వేల కోట్ల పైచిలుకు మొత్తానికి పెంచాలన్న ప్రభుత్వ వినతిని క్షేత్రస్థాయిలో పర్యటించేందుకు ప్రాజెక్టు అధారిటీ(పీపీఏ) సీఈవో బృందం ఇక్కడ పర్యటించనుంది. నిజానికి దేశంలో ఏ ప్రాజెక్టు విషయంలోనూ ఇలా సీఈవో నేరుగా రంగంలోకి దిగిన సందర్భం లేదని నిపుణులు అంటున్నారు.
దాదాపు ఆ మొత్తానికి కేంద్రం అంగీకారం తెలిపేందుకు ఓకే చెప్పనుందని.. ఈ క్రమంలోనే నిబంధనల మేరకు సీఈవోను పంపుతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇక, ఈ నెల 25న పేదలకు పాతిక లక్షల ఇళ్ల స్థలాలను పంచేందుకు చేసుకున్న ఏర్పాట్లు పూర్తి కావడం మరో కీలక విషయం. వెరసి.. వైసీపీలో నూతనోత్తేజం కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు.