వర్ష బాధిత జిల్లాల కలెక్టర్లతో సీఎం వైయస్.జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీ వర్షాల నేపథ్యంలో తగిన కార్యచరణ సిద్ధం చేయాలన్న సీఎం జగన్… బాధితులను ఆదుకోవడంలో ఉదారంగా ఉండాలని ఆదేశించారు. ముంపునకు గురైన ప్రతి కుటుంబానికి రూ.2వేల రూపాయలు ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు. ఇళ్లను శుభ్రం చేసుకోవడానికి ఈ డబ్బు ఉపయోగపడుతుందన్న సీఎం… బాధితులకు నాణ్యమైన సేవలు అందించాలన్నారు.
మంచి భోజనం, తాగునీరు అందించాలన్న సీఎం… వర్షాల తర్వాత కూడా వ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. తిరుమల దర్శనానికి వచ్చిన భక్తులకు సహాయంగా నిలవాలని సీఎం ఆదేశించారు. రైళ్లు, విమానాలు రద్దైన నేపథ్యంలో వారికి అన్నిరకాలుగా తోడుగా ఉండాలని… ప్రమాదకర పరిస్థితుల నేపథ్యంలో వారికి కిందకు రాకుండా పైనే ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు.
కనీసం ఒకటి, రెండు రోజులు వారికి తగిన వసతులు సమకూర్చాలని ఆదేశించారు. టీటీడీ అధికారులను సమన్వయం చేసుకుని యాత్రికులకు సహాయంగా నిలవాలని పేర్కొన్నారు. తిరుపతినగరంలో మున్సిపాల్టీ సహా, ఇతర సిబ్బందిని కూడా వినియోగించి పారిశుధ్యం పనులు చేపట్టాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.