స్కూళ్లు, అంగన్వాడీల్లో ఒక్క ఉద్యోగిని కూడా తొలగించం : సిఎం జగన్

నూతన విద్యా విధానంపై ఇవాళ సీఎం జగన్ చర్చ నిర్వహించారు. ఈ సందర్బంగా నూతన విద్యా విధానం అమలుకై కార్యాచరణ రూపొందించాలని.. రెండేళ్లలో కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నూతన విద్యా విధానం వల్ల ఉపాధ్యాయులకు, పిల్లలకు ఎనలేని మేలు జరుగుతుందని… మండలానికి ఒకటి లేదా రెండు జూనియర్‌ కాలేజీలు ఉండాలన్నారు. ఆట స్థలం లేని స్కూళ్లకు నాడు- నేడు కింద భూమి కొనుగోలు చేస్తామని.. వచ్చే ఏడాది నుంచి విద్యా కానుకలో అదనంగా స్పోర్ట్స్‌ దుస్తులు, షూస్ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని పేర్కొన్నారు. స్కూళ్లు, అంగన్వాడీల్లో ఒక్క ఉద్యోగిని కూడా తొలగించడం లేదని… ఒక్క సెంటర్‌ను కూడా మూసివేయడం లేదన్నారు. రెండు రకాల స్కూళ్లు ఉండాలన్నది మన లక్ష్యమని… పీపీ1, పీపీ2, ప్రీపరేటరీ క్లాస్, ఒకటి, రెండు తరగతులు ఒకటిగానూ ఉంటారన్నారు.

వీరందరికీ కిలోమీటరు పరిధిలోపు వీరికి స్కూలు ఉంటుందని.. ఉపాధ్యాయుడు, విద్యార్ధి నిష్పత్తి హేతుబద్ధంగా ఉండడం అన్నది ఈ విధానంలో ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ఒకే ఉపాధ్యాయుడు అన్ని సబ్జెక్టులు బోధించే విధానం సరికాదని.. ఫౌండేషన్‌ కోర్సులో ఇది చాలా అవసరమని తెలిపారు. ఎన్‌ఈపీ(నేషనల్‌ ఎడ్యుకేషన్‌ ప్లాన్‌) ప్రకారం నాణ్యమైన విద్య, నాణ్యమైన బోధన, నాణ్యతతో కూడిన మౌలిక సదుపాయాలు కల్పన మన లక్ష్యమని వెల్లడించారు. నూతన విద్యా విధానంలో ఒక స్కూల్‌ మూతపడ్డం లేదని.. ఒక్క ఉపాద్యాయుడ్ని కూడా తీసేయడం లేదన్నారు.