గత ప్రభుత్వం గాల్లో మాటలు చెబుతూ.. గ్రాఫిక్స్ చూపించేదని సీఎం జగన్ ఎద్దేవా చేశారు. ‘నా నడక నేలపైనే. నా ప్రయాణం సామాన్యులు, పేద వర్గాలతోనే. నా యుద్ధం పెత్తందారులతోనే. పేదరిక నిర్మూలనే నా లక్ష్యం. కాబట్టే నా ఎకనామిక్స్ వేరే. పేదలు బలపడితేనే పేద కులాలు బాగుంటాయి. ఇదే నమ్మి, ఆచరించి, ఫలితం చూపించా. ఇదే నా ఎకనామిక్స్, పాలిటిక్స్, ఇదే నా తండ్రిని చూసి నేను నేర్చుకున్న హిస్టరీ’ అని సీఎం జగన్ మాట్లాడారు. గత ప్రభుత్వాల బడ్జెట్లు ఎవరికీ అర్ధమయ్యేవి కావని.. ఇంటింటికీ వెళ్లి జరిగిన మంచి పనిని వివరించామని సీఎం తెలిపారు.
మా నైతికతకు, నిబద్ధతకు ఇది నిదర్శనమన్నారు. 13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చామని.. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌ను ఏర్పాటు చేశామని జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. రెవెన్యూ డివిజన్‌లను 51 నుంచి 76కు పెంచామని ముఖ్యమంత్రి వెల్లడించారు. పట్టణాల్లో పదివేలకు పైగా సర్వేయర్లు అందుబాటులో వున్నారని.. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలోనే ఏపీ నెంబర్ వన్ అని జగన్ అన్నారు. 11.23 శాతం ఆర్ధిక వృద్ధి రేటుతో రాష్ట్రం ఆర్ధిక వృద్ధి రేటుతో దూసుకుపోతోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.