సీఎం కేసీఆర్‌ నామినేటెడ్‌ పోస్టులపై దృష్టి పెట్టారా?

-

సీఎం కేసీఆర్‌ నామినేటెడ్ పదవుల భర్తిపై దృష్టిపెట్టారా..కేటీఆర్ కి సీఎం బాధ్యతలు అప్పగిస్తారన్న ప్రచారం నేపథ్యంలో టీఆర్‌ఎస్‌లో ప్రస్తుతం ఈ హడావిడే కనిపిస్తుంది.ఎన్నికల సమయంలో గులాబీ దళపతి నుంచి హామీలు పొందిన నాయకులు వాటిని గుర్తు చేసే పనిలో ఉన్నారట. కుదిరితే ఎమ్మెల్సీ లేకపోతే కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి ఇవ్వాలని పార్టి పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారట.

అసెంబ్లీ ఎన్నికలు ముగిసి రెండేళ్లు గడిచిపోయింది. ఇక మిగిలింది మూడేళ్లే . జమిలీ ఎన్నికలంటూ మధ్యలో హడావిడి ఈ నేపథ్యంలో . ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవద్దనే లక్ష్యంతో పావులు కదుపుతున్నారట పదవులు ఆశిస్తున్న నేతలు. పార్టిలో చాలా మంది సీనియర్లు మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నా నెరవేరలేదు. ఎన్నికల్లో టికెట్‌ లభించిన సీనియర్లూ ఉన్నారు. వీరంతా వివిధ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవులపై ఆశలు పెట్టుకున్నారు. కొందరైతే ఆ కార్పొరేషన్‌.. ఈ కార్పొరేషన్‌ అని లెక్కలు కూడా వేసుకుంటున్నారట.

మరోవైపు ఏడాది కాలంలో భారీ సంఖ్యలో ఖాళీ కానున్న ఎమ్మెల్సీ స్థానాలు టీఆర్ఎస్ నేతలను ఊరిస్తున్నాయి. అధికారిక హోదా కోసం ఆరాటపడుతున్న వారంతా… ఆశల పల్లకీలో ఊరేగుతున్నారు. శాసనమండలిలోని మొత్తం 40 మంది సభ్యులకుగాను వచ్చే ఏడాది జనవరి నాలుగో తేదీలోగా సగానికి పైగా ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుంది. శాసనమండలికి స్థానిక సంస్థల కోటా నుంచి ఎన్నికైన 14 మందిలో 12 మంది వచ్చే ఏడాది జనవరి 4న పదవీ కాలపరిమితి పూర్తి చేసుకుంటారు. ఖాళీ అయ్యే వాటిలో 19 శాసనమండలి స్థానాలు తిరిగి టీఆర్‌ఎస్‌ ఖాతాలోనే చేరే అవకాశముంది.

ఇక ఎమ్మెల్యేల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్‌కు చెందిన దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి కేబినెట్ ర్యాంక్‌ కలిగిన కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి ఆశిస్తున్నారు. ఈయన స్వతహాగా ఇంజనీర్‌ కావడంతో నీటిపారుదల రంగంతో సంబంధం ఉన్న కార్పొరేషన్‌ లేకపోతే చేనేత జౌళి శాఖ కార్పొరేషన్‌ చైర్మన్‌ అయినా దక్కుతుందని అనుచరవర్గం లెక్కలు వేసుకుంటోంది. ఇలాంటి ఊహాలోకంలోనే విహరిస్తున్నారు మక్తల్‌ ఎమ్మెల్యే చిట్టెం రామ్మెహన్‌రెడ్డి. వైద్యం లేదా చేనేత రంగానికి సంబంధించిన కార్పొరేషన్‌ ఖాయమని నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి అనుకుంటున్నారు. ఒకవేళ చేనేత శాఖకు సంబంధించిన పోస్ట్‌ దక్కితే నారాయణపేట నేతన్నకు ప్రత్యేక గుర్తింపు వస్తుందని ప్రచారం మొదలుపెట్టారు. ఇలాంటి ఆశల్లోనే నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి కూడా ఉన్నారట.

జడ్చర్ల ఎమ్మెల్యే మాజీ మంత్రి లక్ష్మారెడ్డి రెండోదఫా కేబినెట్‌లో చోటు దక్కకపోవడంతో ఇంకా అసంతృప్తితోనే ఉన్నట్లు సమాచారం. ఒకవేళ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి ఇచ్చినా.. దానిని చేపట్టకపోవచ్చని భావిస్తున్నారు. ఇక జిల్లాల్లో డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్‌ పదవులు ఆశించి భంగపడ్డ నాయకులు కూడా కార్పొరేషన్‌ చైర్మన్‌ లేదా.. డైరెక్టర్‌ పోస్టుల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారట.

పదవుల పందేరంలో సీఎం కేసీఆర్‌ లెక్కలు పక్కగా ఉంటాయి. అధికారిక ప్రకటన వెలువడే వరకూ పెదవి దాటి మాట బయటకు రాదు. మరి.. ఆశావహుల్లో ఎందరికి పదవీయోగం ఉంటుందో… గులాబీ దళపతి ఆశీస్సులు ఎవరికి లభిస్తాయో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news