బీజేపీది ప్రైవేటైజేషన్ అయితే… బీఆర్ఎస్ పాలసీ నేషనలైజేషన్: కేసీఆర్‌

-

నేడు బీఆర్‌ఎస్‌ పార్టీ ఖమ్మంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ మోడల్‌ను దేశమంతటా అమలు చేస్తామని అన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్, దళిత బంధు స్కీమ్‌లను దేశమంతటా ప్రవేశపెడుతామన్నారు సీఎం కేసీఆర్. బీజేపీ పాలసీ ప్రైవేటైజేషన్ అయితే మా పాలసీ నేషనలైజేషన్ అన్నారు సీఎం కేసీఆర్. 2024 ఎన్నికల తర్వాత బీజేపీ ఇంటికి బీఆర్ఎస్ ఢిల్లీకి వెళ్లడం ఖాయమన్నారు. LIC, విశాఖ ఉక్కు వంటి ప్రభుత్వ సంస్థలను నరేంద్ర మోడీ ప్రభుత్వం అమ్ముతోందని తాము అధికారంలోకి వస్తే మీరు అమ్మిన సంస్థలను తిరిగి కొంటామన్నారు. దళితబంధును దేశమంతటా ఇవ్వాలని డిమాండ్ చేసిన కేసీఆర్.. మోడీ సర్కార్ ఇవ్వకుంటే తాము అధికారంలోకి రాగానే దేశమంతటా అమలు చేస్తామని చెప్పారు. సైన్యం రిక్రూట్‌మెంట్లలో కూడా మోడీ సర్కార్ వేలు పెడుతోందని విమర్శించిన ఆయన బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే అగ్నిపథ్‌ను రద్దు చేస్తామన్నారు.

మేక్ ఇన్ ఇండియా జోక్ ఇన్ ఇండియాగా మారిందన్నారు.దేశంలో మత పిచ్చి లేపుతున్నారని, దేశంలోని ప్రస్తుత దుస్థితికి కాంగ్రెస్, బీజేపీనే కారణమన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉంటే బీజేపీని, బీజేపీ అధికారంలో ఉంటే కాంగ్రెస్‌ను విమర్శించడం ఇదే ఇన్నేళ్లుగా జరుగుతోందన్నారు. కేంద్ర వైఖరి చాటలో తవుడు పోసి కుక్కల కొట్లాట పెట్టినట్టుందని విమర్శించారు. లొడలొడ మాట్లాడే ప్రధాని మోడీ రాష్ట్రాల మధ్య నీటి పంచాయితీని ఎందుకు పరిష్కరించలేకపోతున్నారని విమర్శించారు. రోజూ వేలాది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నందుకు సిగ్గుపడాలని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ విధివిధానాలు త్వరలో ప్రజల ముందు వివరిస్తామన్నారు. ఈ సభకు కేరళ సీఎం పినరయి విజయన్, ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్‌తో పాటు బీఆర్ఎస్ ఎంపీలు, నేతలు హాజరయ్యారు. బీజేపీ ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తోందని, కేంద్ర దర్యాప్తు సంస్థలను జేబు సంస్థలుగా మార్చుకుని ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందని జాతీయ నేతలు ఆరోపించారు. అంతకు ముందు కంటి వెలుగు రెండో విడత కార్యక్రమాన్ని జాతీయ నేతలతో కలిసి కేసీఆర్ ప్రారంభించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news