ఉత్తమ ప్రతిభ కనబరిచిన దేశీయ చలన చిత్రాలకు ప్రతీయేటా కేంద్ర ప్రభుత్వం జాతీయ అవార్డులను ప్రకటిస్తోంది. అందులో భాగంగా ఇటీవల 69వ జాతీయ చలన చిత్ర అవార్డులను కేంద్రం ప్రకటించింది. ఈ అవార్డుల్లో తెలుగు చిత్రాలు సత్తా చాటాయి. పలు విభాగాల్లో తెలుగు సినిమాలు అవార్డులను సొంతం చేసుకోవడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు.
జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు గెలుచుకున్న నటుడు. అల్లు అర్జున్కు సీఎం కేసీఆర్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. తెలుగు సినీ పరిశ్రమకు జాతీయ అవార్డులు దక్కడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అవార్డులు సాధించిన ఆర్ఆర్ఆర్, పుష్ప చిత్ర బృందాలకు అభినందనలు తెలిపారు. కాగా, ఇటీవల ప్రకటించిన జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమాలు 10 విభాగాల్లో పురస్కారాలను దక్కించుకున్నాయి. ఉత్తమ సంగీత దర్శకుడుగా దేవిశ్రీప్రసాద్, ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ కాళభైరవ, ఉత్తమ ఫిల్మ్ క్రిటిక్ పురుషోత్తమాచార్యులుతో పాటు ఆయా విభాగాల్లో జాతీయ అవార్డులు పొందిన పలు సినిమాలకు చెందిన నిర్మాతలు, దర్శకులు, నటులు, సాంకేతిక సిబ్బందికి ఈ సందర్భంగా కేసీఆర్ అభినందలు తెలిపారు.