తెలంగాణాలో ఈ రోజు 5 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయని తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ వివరించారు. కాసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన ఆయన వ్యాధి సోకిన వారిలో అందరికి అంతర్జాతీయ ప్రయాణ చరిత్ర ఉందని అన్నారు. మొత్తం 26 కేసులు నమోదు అయ్యాయని వివరించారు. ఒకరికి నివారించారని చెప్పుకొచ్చారు. అన్ని విమానాలు మరియు ఓడరేవులు మూసివేయబడ్డాయన్నారు.
విదేశీ ప్రయాణికులు కచ్చితంగా స్వీయ నిర్భందంలో ఉండాలని ఆయన సూచించారు. ఇది వ్యాప్తి చెందకుండా చూసుకోవడం ప్రతీ ఒక్కరి బాధ్యత అని అన్నారు. ఈ రోజు క్రమశిక్షణ, మార్చి 31 వరకు పాటించాలని కోరారు. 1897 చట్టం ప్రకారం తెలంగాణ మార్చి 31 వరకు లాక్ డౌన్ లో ఉంటుందని అన్నారు. అందరూ ఇంట్లోనే ఉండాలని సూచించారు. ఒక వ్యక్తి మాత్రమే నిత్యావసర సరుకుల కోసం వెళ్లాలని కెసిఆర్ సూచించారు.
రోజువారీ వేతనాలతో బ్రతికే పేదలకు 12 కిలోల ఉచిత బియ్యం మరియు కిరాణా సరుకులు ఇస్తామని, ఒక్కో కుటుంబానికి 1500 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించామని చెప్పారు. అవసరమైన సేవలు మాత్రమే పనిచేస్తాయన్నారు. ప్రజా రవాణా మరియు ప్రైవేట్ సేవలు మూసివేయబడతాయన్నారు. బస్సులు, ఆటోలు, క్యాబ్‌లు, మెట్రో సర్వీసులు నిలిపివేయబడతాయని స్పష్టం చేసారు. అన్ని రాష్ట్ర సరిహద్దులు మూసి వేశామని అన్నారు. మందులు, బియ్యం మరియు కూరగాయల వాహనాలకు మాత్రమే అనుమతించబడుతాయని చెప్పారు.