ఈ నెల 26వ తేదీన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్‌కు రానున్నారు. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. మోడీకి స్వాగతం పలికేందుకు రావడం లేదు. దీంతో మరోసారి కేంద్ర, తెలంగాణ రాష్ట్రం మధ్య సంబంధాలు సవ్యంగా లేవని నిరూపితమైంది. ప్రస్తుతం సీఎం కేసీఆర్ దేశ పర్యటనలో ఉన్నారు. ఈ నెల 26వ తేదీన బెంగళూరు వెళ్లనున్నారు. అయితే అదే రోజు హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ)లో 20వ గ్రాడ్యుయేషన్ వేడుకలకు మోడీ రానున్నారు. సీఎం కేసీఆర్ బిజీ షెడ్యూల్ వల్ల రావడం లేదని ఐఎస్‌బీ డీన్ మదన్ పిల్లుట్ల వెల్లడించారు.
సాధారణంగా దేశ ప్రధాని రాష్ట్రానికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి స్వాగతం పలకాలి. కానీ టీఆర్ఎస్-బీజేపీకి సత్సంబంధాలు లేకపోవడంతో ఆ సంప్రదాయాలు మారుతున్నాయి. ఫిబ్రవరి 5వ తేదీన కూడా మోడీ హైదరాబాద్‌కు వచ్చారు. అప్పుడు కూడా సీఎం కేసీఆర్ స్వాగతం పలకలేదు. సీఎం స్థానంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎయిర్‌పోర్టుకు వెళ్లి స్వాగతం పలికారు. గడిచిన రెండేళ్లలో మోడీ నిర్వహించిన సమావేశాలకు సీఎం కేసీఆర్ హాజరు కాలేదు. దీంతో ఇప్పటికీ మూడు సార్లు ప్రధాని మోడీ పర్యటనలో సీఎం కేసీఆర్ దూరమయ్యారు.