హైదరాబాద్: హుజూరాబాద్‌పై సీఎం కేసీఆర్ వ్యూహం కొనసాగుతోంది. అంది వచ్చిన ప్రతి అంశాన్ని అనుకూలంగా మార్చుకునేందుకు కసరత్తులు ప్రారంభించారు. సాధారణ ఎన్నికల్లో ఈటల రాజేందర్ టీఆర్ఎస్ నుంచి గెలిచారు. తర్వాత జరిగిన పరిణామాలతో ఈటల రాజీనామా చేశారు. త్వరలో హుజూరాబాద్‌లో ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉంది. ఈటలకు హుజూరాబాద్‌లో చెక్ పెట్టేందుకు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే హుజూరాబాద్‌ను జల్లెడ పట్టి ఎన్నికల సర్వేను కూడా తెలుసుకున్నారని ప్రచారం జరుగుతోంది. దీంతో ఈటలకు దీటుగా బలమైన నేతను రంగంలోకి దింపాలని నిర్ణయించుకున్నారు.
ఈ మేరకు టీటీడీపీ నేత , బీసీ సామాజిక వర్గానికి చెందిన బలమైన వ్యక్తి, మాజీ మంత్రి అయిన ఎల్ రమణను టీఆర్ఎస్‌లోకి తీసుకుని హుజూరాబాద్ బరిలో నిలపాలని యోచిస్తున్నారు. దీంతో రమణను టీఆర్ఎస్‌లోకి తీసుకునేందుకు ప్రయత్నాలు జరిపారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ద్వారా ఎల్ రమణను ప్రగతి భవన్‌కు పిలుపించుకుని కలిశారు. అంతేకాదు టీఆర్ఎస్‌లో చేరాలని ఎల్ రమణను ఆహ్వానించారు. త్వరలో మంచి ముహూర్తం చూసుకుని టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకునేందుకు ఎల్ రమణ కూడా సిద్ధమయ్యారు. ఇలా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటలకు చెక్ పెట్టాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ఇక హుజూరాబాద్ ఉపఎన్నికలో ఎల్ రమణ పోటీ చేస్తే ఈటల గెలుపు అసాధ్యమేనని టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు అంటున్నారు.