ఎన్నో సంవత్సరాలుగా పాలమూరు రైతులు ఎదురుచూస్తున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు పర్యావరణ శాఖ అనుమతులు ఇచ్చింది. దీంతో.. వీలైనంత త్వరగా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌ను పూర్తి చేసేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అయితే.. దీనిపై వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. పాలమూరు ప్రజల కాళ్లను కృష్ణమ్మ నీళ్లతో తడుపుతానని ముఖ్యమంత్రి కేసీఆర్ శపథం చేశారని.. ఆ కల త్వరలోనే నెరవేరబోతోందని తెలిపారు. ఇక పాలమూరు రైతుల కష్టాలు తీరినట్లేనన్న అన్నారు. మిగిలిన పనులను వీలైనంత తొందరగా పూర్తి చేసి.. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా నీళ్లు విడుదల చేస్తామని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.
జిల్లా ప్రజల వెతలు సంపూర్ణంగా తీరే శుభసమయం ఆసన్నమవుతోందని ఆనందం వ్యక్తం చేశారు. ఇక పాలమూరు ప్రజల కష్టాలు తీరినట్లేనని మంత్రి వ్యాఖ్యానించారు. రైతులు, ప్రజలు వేయి నీళ్ల కోసం కళ్లతో ఆ సమయం కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. ఇప్పటికే నార్లాపూర్, ఏదులలో పంపుల ఎరెక్షన్ పనులు పూర్తయ్యాయని.. మిగిలిన పనులు ఈ అనుమతుల కోసం ఆగాయని అన్నారు. ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టును తీసుకెళ్లడం అనితర సాధ్యమైన పని అన్న నిరంజన్ రెడ్డి… అది ముఖ్యమంత్రి కేసీఆర్ తోనే సాధ్యమైందని తెలిపారు.పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతుల నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల రైతులకు అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుదలతో చేసిన కృషి ఎట్టకేలకు ఫలితం దక్కిందని అన్నారు. చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్న పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల ఇక యుద్ధప్రాతిపదికన పూర్తవుతుందని మంత్రి కేటిఆర్ ట్వీట్లో పేర్కొన్నారు.