పంట నష్టంపై అంచనా వేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. అకాలవర్షం, వడగళ్ల వానతో వికారాబాద్ జిల్లా మర్పల్లి, మోమిన్ పేట మండలాలలోని 13 గ్రామాలలో ఉద్యాన, వ్యవసాయ పంటలకు నష్టం జరిగినట్లు గుర్తించారు.
అయితే, సీఎం శ్రీ కేసీఆర్ ఆదేశాల మేరకు ఆ ప్రాంతాల్లో నేడు పర్యటించనున్నారు వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వారితో పాటు రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా రాజేశ్వర్ రెడ్డి.
వికారాబాద్ జిల్లా మర్పల్లి, మోమిన్ పేట మండలాలలో వడగళ్ల వాన తీవ్ర ప్రభావం చూపి పంటనష్టం కలిగించినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. మామిడి, గులాబీ, ఉల్లిగడ్డ, బొప్పాయి వంటి ఉద్యాన, కొంతమేర మొక్కజొన్న వంటి వ్యవసాయ పంటలు దెబ్బతిన్నట్లు తెలుస్తున్నది.
ప్రత్యక్షంగా పంటనష్టం తీవ్రతను పరిశీలించి రైతులకు భరోసా కల్పించనున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మంత్రితో పాటు ఆయా నియోజకవర్గాల శాసనసభ్యులు పర్యటనలో పాల్గొంటారు.