ఐకమత్యంతో జాతి ఔన్నత్యం చాటాలి: సీఎం

-

అనేక త్యాగాలు, పోరాటాలతో దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని ముఖ్యమంత్రి కేసీఆర్​ పేర్కొన్నారు. గాంధీజీ ఎన్నో త్యాగాలు చేసి.. స్వాతంత్య్ర పోరాటానికి నాయకత్వం వహించారని తెలిపారు. ఎన్నో దేశాల్లో స్వాతంత్య్ర పోరాటాలకు గాంధీజీ స్ఫూర్తిగా నిలిచారన్నారు.

ఏ దేశానికికైనా స్వేచ్ఛ, స్వాతంత్య్రం ఒక అపురూప సందర్భమన్న కేసీఆర్​.. స్వాతంత్య్ర పోరాటంలో ఎందరో నేతలు జీవితాలు త్యాగాలు చేశారని గుర్తు చేశారు. కొత్త తరం వారికి స్వాతంత్య్ర పోరాట సందర్భ ఘటనలు తెలియవని వ్యాఖ్యానించిన సీఎం కేసీఆర్​.. ఉద్యమకారులను ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం దారుణంగా అణచివేసిందని తెలిపారు. స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా అద్భుతంగా జరగాలని ఆకాంక్షించారు.

”ఆసేతు హిమాచలం పోరాటం జరిపి స్వాతంత్య్రం తెచ్చారు. స్వాతంత్య్రం వచ్చాక ఈ దేశాన్ని కలిపి ఉంచేందుకు ఎంతో కష్టపడ్డారు. వందల మంది సంస్థానాల అధిపతులను ఒప్పించారు. రాజభరణాలు ఇచ్చారు. జమ్ముకశ్మీర్‌, జునాగఢ్‌, ఇండోర్‌, హైదరాబాద్‌.. దేశంలో విలీనమయ్యాయి. ఎన్నో వ్యయ ప్రయాసల తర్వాత పుదుచ్చేరి, గోవా, సిక్కిం కలిశాయి. పేదరికం ఉన్నంత కాలం దేశంలో అలజడులు, అశాంతి ఉంటాయి. దేశంలో పేదరికం పూర్తిగా తొలగిపోతేనే అభివృద్ధి సాధిస్తాం. ఈ దేశం నాదనే అభిప్రాయం ప్రతి ఒక్కరిలో కలగాలి.” అని కేసీఆర్ అన్నారు.

“జాతిపిత గాంధీజీనీ కొందరు కించపరిచేలా ప్రవర్తిస్తున్నారు. మహాత్ముడు ఎప్పటికీ మహాత్ముడుగానే ఉంటాడు. మనం స్వేచ్ఛా వాయువులు పీల్చేందుకు ఎందరో ప్రాణత్యాగం చేశారు. తెలంగాణ వచ్చాక అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. రాష్ట్రంలో శాంతిభద్రతలు పరిఢవిల్లుతున్నాయి. చిల్లర మల్లర చేష్టలను ప్రతి ఒక్కరూ చీల్చి చెండాడాలి. ఐకమత్యంతో ఉండి ఈ జాతి ఔన్నత్యం చాటాలి.” – కేసీఆర్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి

Read more RELATED
Recommended to you

Latest news