ఆర్టీసి సమ్మెపై తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సుదీర్ఘకాలంగా సాగుతోన్న సమ్మెకు ఎట్టకేలకు ముగింపు పలకాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలోనే గురువారం సాయంత్రం ప్రెస్‌మీట్ పెట్టిన ఆయన కార్మికులను విధుల్లో చేరమని చెప్పారు. కార్మికులను ముందు నుంచి విధుల్లో చేరాలని తాము చెపుతూనే ఉన్నామని.. జీతాలు లేక కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారని.. ఈ పరిస్థితి రావడానికి యూనియన్లే కారణమని ఆయన తన అసహనం వ్యక్తం చేశారు.
యూనియన్లు కార్మికుల బతుకులతో ఆడుకుంటారా ? అని ప్రశ్నించారు. కార్మికులు చాలా దీన స్థితిలో ఉన్నారని హైకోర్ట్ జడ్జి చెప్పారు…. ఆర్టీసి కార్మికులు విధుల్లోకి చేరమని చెప్తున్నా… రేపటి నుంచి సంతోషంగా ఉద్యోగాలు చేసుకోవాలని చెప్పారు. ఆర్టీసికి తక్షణ సాయంగా వంద కోట్లు ఇస్తామని… సోమవారం నుంచి చార్జీలు పెంచుకోవచ్చని ఆయన సూచించారు. ఆర్టీసి కార్మికులకు జీతాలు ఇస్తామని కెసిఆర్ హామీ ఇచ్చారు. నష్టాన్ని తగ్గించుకునేందుకు చార్జీలు పెంచుకోండి. భవిష్యత్తులో ఇంకా సాయం చేస్తామని, సంస్థ బతకాలని ఆయన ఆకాంక్షించారు.
ఇప్పటికైనా కార్మికులు నిజాలు తెలుసుకోవాలన్నారు. ఎలాంటి కండీషన్లు లేకుండా విధుల్లో చేరాలని ఆయన కోరారు. ఒక పెద్ద అన్న గా తెలంగాణా బిడ్డగా మిమ్మల్ని ఆదుకుంటా అని కేసీఆర్ తెలిపారు. పెట్టుబడిదార్లకు ఆర్టీసిని ఇవ్వాలని అనుకోవడం లేదన్నారు. కిలోమీటరుకి 20 పైసల చొప్పున చార్జీలు పెంచుకోవచ్చు అన్నారు. అయితే సంస్థను మాత్రం ప్రభుత్వంలో కలిపేది లేదన్నారు. అయితే యూనియన్లను మాత్రం తాను సహించేది లేదన్నారు. సమ్మెలో మరణించిన కార్మికుల కుటుంబంలోని వ్యక్తికి ఉద్యోగం ఇస్తామని స్పష్టం చేసారు.