సీఎం కేసీఆర్ త్వరలోనే బిఆర్ఎస్ పార్టీ కార్యాచరణను ప్రకటిస్తారు – బోయినపల్లి వినోద్

-

  • నేడు కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు చెందిన వివిధ వర్గాల ప్రముఖులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ తో సమావేశమయ్యారు.గురువారం మంత్రుల నివాస ప్రాంగణంలో వినోద్ కుమార్ తో ప్రత్యేకంగా సమావేశమైన కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల ప్రముఖులు పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.

ముఖ్యంగా భారత్ రాష్ట్ర సమితి (బి.ఆర్.ఎస్) పార్టీని కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో విస్తృతంగా విస్తరించేందుకు సంబంధించిన అంశాలపై వారు వినోద్ కుమార్ తో సుదీర్ఘంగా చర్చించారు. కర్ణాటక రాష్ట్రం ధార్వాడ్, హుబ్లీ నగరాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు, యాదవ, కుర్మ వర్గానికి చెందిన సిద్ధన్న తేజీ, బెంగళూరు నగరానికి చెందిన సహకార సెక్టార్ ఉద్యమ నాయకులు నవీన్, మహిళల సమస్యలపై ఉద్యమించే నాయకురాలు బెంగళూరుకు చెందిన ఉషారాణి, చిక్బల్లాపూర్ ప్రాంతానికి చెందిన ప్రముఖ కార్మిక నాయకులు ప్రకాష్, మహారాష్ట్ర యావత్ మాల్ జిల్లా పూసద్ ప్రాంతానికి చెందిన గిరిజన సంఘాల నాయకురాలు సింపుల్ రాథోడ్, అకోలా ప్రాంతానికి చెందిన అంబు నాయక్ లు బీ.ఆర్.ఎస్. పార్టీని తమ రాష్ట్రాల్లో అపూర్వంగా స్వాగతం పలుకుతామని వినోద్ కుమార్ కు తెలిపారు.

కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో రాజకీయ అస్థిరత ఉందని, ప్రజల జీవన స్థితి దారుణంగా ఉందని ఆయా రాష్ట్రాల ప్రముఖులు వినోద్ కుమార్ దృష్టికి తీసుకుని వచ్చారు.తెలంగాణ రాష్ట్రంలో అమలు జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లోని ప్రజలు కూడా కోరుకుంటున్నారని దార్వాడ్, హుబ్లీ నగరాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు సిద్దన్న తేజి అన్నారు.ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న గొర్రెల పంపిణీ కార్యక్రమం సోషల్ మీడియా ద్వారా కర్ణాటక రాష్ట్ర కుర్మ, యాదవ వర్గాలకు గమనించి… ఇలాంటి గొప్ప సంక్షేమ పథకం తమకు కావాలని కోరుకుంటున్నారన్న విషయాన్ని సిద్దన్న తేజీ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు.

ఇలాంటి పథకం కావాలన్న కర్ణాటక యాదవ, కుర్మ వర్గాల డిమాండ్ మేరకు కర్ణాటక ముఖ్యమంత్రి బొమ్మయ్ కూడా ఇటీవల గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రకటించారని సిద్దన్న తేజీ తెలిపారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన ప్రముఖులతో కలిసి బోయినపల్లి వినోద్ కుమార్ మంత్రుల నివాసంలో లంచ్ చేశారు. త్వరలోనే బీ.ఆర్.ఎస్. పార్టీ కార్యాచరణను పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రకటిస్తారని, మరోసారి సమావేశమై భవిష్యత్ కార్యక్రమాన్ని రూపొందించి .. ఆ దిశలో ముందడుగు వేద్దామని వినోద్ కుమార్ మహారాష్ట్ర, కర్ణాటక ప్రముఖులకు సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version