దేశ రాజధానిలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో ఢిల్లీవాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. యమున నది ఉగ్ర రూపం దాల్చడంతో ఢిల్లీకి ముంపు పొంచి ఉందని నివేదకలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వర్షాలపై సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. లోతట్టు ప్రాంతాల ప్రజలు తమ ఇండ్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని కేజ్రీవాల్ కోరారు. యమున నదిలో నీటి ప్రవాహం 1978లో గరిష్ట స్ధాయి 207.48 మీటర్లను దాటిన తర్వాత తొలిసారిగా 207.71 మీటర్లకు పెరగిందని, నదిలో నీటి ప్రవాహ స్ధాయి మరింత పెరిగే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇండ్లను ఖాళీ చేసి పునరావాస శిబిరాలకు వెళ్లాలని కోరారు.
వరద నీటిని చూసేందుకు ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావద్దని నీటి ప్రవాహం అనూహ్యంగా పెరుగుతుండటం ప్రమాదకరమని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. యమున నదికి సమీపంలోని ఆరు జిల్లాల్లో సహాయ, పునరావాస శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అవసరమైతే నగరంలోని స్కూల్స్‌ను మూసివేసి వాటిని పునరావాస శిబిరాలుగా మార్చాలని కేజ్రీవాల్ అన్ని జిల్లాల మేజిస్ట్రేట్‌లను ఆదేశించారు.