రాష్ట్రంలో చలిపంజా విసురుతోంది. ఈశాన్య గాలుల ప్రభావంతో రెండ్రోజుల నుంచి చలి తీవ్రత పెరిగింది. రాబోయే మూడురోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే ప్రమాదం ఉందని వాతావరణ విభాగం ప్రకటించింది. ఈశాన్య గాలుల ప్రభావంతో మధ్యాహ్నంపూట వాతావరణం చల్లగా ఉంటోంది. ఇక రాత్రివేళల్లో అయితే చలికి రోడ్లపై జనసంచారం తగ్గింది.
బస్టాండ్లు, ఫుట్‌పాత్‌లపై జీవనం సాగించే అభాగ్యుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. చలికి గజగజ వణికిపోతున్నారు. మరికొందరు చలిమంటలు వేసుకుంటున్నారు. ఉదయం 8 గంటలతర్వాత పొగమంచు కొనసాగుతోంది. వచ్చే మూడురోజుల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3నుంచి 5డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
వాతావరణం ఒక్కసారిగా మారడంతో సీజనల్ వ్యాధులు విజృంభించే ప్రమాదం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు బయటకు వెళ్లినప్పుడు తప్పకుండా ముఖానికి మంకీ క్యాప్, మఫ్లర్ వంటివి ధరించాలని సూచిస్తున్నారు.