టీఆర్ఎస్ కి ప్లస్ అవుతున్న లెఫ్ట్ పార్టీల తడబాటు

-

ఒకప్పుడు కమ్యూనిస్టు పార్టీల మద్దతు కోసం ప్రధాన రాజకీయ పార్టీలు వెంటపడేవి. కామ్రేడ్‌లు గెలిపిస్తారు అనే దానికంటే.. వాళ్లు తోడు ఉంటే నమ్మకం.. సెంటిమెంట్ అని భావించేవారు. మిగతా పార్టీలకంటే భిన్నమని చెప్పుకొనే లెఫ్ట్‌ పార్టీలు ఒక్కో ఎన్నికలో ఒక్కో పార్టీతో జతకట్టడం ద్వారా విశ్వసనీయత కోల్పోయాయి. లెఫ్ట్ పార్టీల తడబాటు నిర్ణయాలు చివరకు అధికారపార్టీకి అనుకూలంగా మారుతున్నాయి.

తెలంగాణలో వామపక్షాలు రాజకీయ ప్రయోగాలు లెఫ్ట్ పార్టీలను క్రాస్ రోడ్స్ లో నిలబెట్టాయి. ఐదేళ్ల కాలంలో ఒక పార్టీకి మద్దతిస్తే కష్టమో సుఖమో వారితో ప్రయాణం చేశారని అనుకుంటారు. కానీ ఉపఎన్నికలు.. మున్సిపల్..కార్పొరేషన్ ఎన్నికల్లో పూటకో వైఖరి తీసుకుంటున్నాయి కమ్యూనిస్టు పార్టీలు. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో సీపీఐ,సీపీఎం పార్టీలు పరస్పరం మద్దతిచ్చుకున్నాయి. ఇటీవల జరిగిన నాగార్జునసాగర్‌ ఉపఎన్నికలో రెండు పక్షాలు మళ్లీ అధికార టీఆర్‌ఎస్‌కు మద్దతిచ్చాయి. సరే అధికార పార్టీతో అలాగే అంటాకాగుతాయా అంటే అంతలోనే మరో నిర్ణయం తీసుకున్నాయి.

తెలంగాణలో జరుగుతున్న మినీ మున్సిపల్ ఎన్నికల్లో వామపక్షాలు రాజకీయ ప్రయోగాలు మరీ తారాస్థాయి కి వెళ్లాయి. ఖమ్మం కార్పోరేషన్లో కామ్రేడ్ల బలం బాగానే ఉంటుంది. సీపీఐ కంటే సీపీఎంకి జిల్లాలో కేడర్‌ ఎక్కువ. ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలకు వచ్చేసరికి సీపీఎం కాంగ్రెస్‌తో.. సీపీఐటీఆర్‌ఎస్‌తో జతకట్టాయి. నాగార్జునసాగర్‌ ఉపఎన్నిక పోలింగ్‌ ముగిసి వారం తిరక్కుండానే వైఖరి మార్చేసుకున్నాయి. నాగార్జునసాగర్‌లో కాంగ్రెస్‌కు కాకుండా టీఆర్ఎస్ కు మద్దతివ్వడంపై వామపక్ష సానుభూతిపరులు గందరగోళానికి లోనయ్యారని చెబుతున్నారు.

ఒకవైపు రాష్ట్రంలోని సమస్యలు..ఉద్యోగాల భర్తీ,డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల కేటాయింపులపై ఆందోళనలు చేస్తున్న లెఫ్ట్‌ పార్టీలు..అధికారపార్టీకి మద్దతివ్వడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. అందుకే సీపీఎం మనసు మార్చుకుని అధికార పక్షానికి దూరం జరగ్గా సీపీఐ మాత్రం బయట పోరాటాలు చేస్తు ఎన్నికల్లో అధికారపక్షాన్ని అంటి పెట్టుకుంది. తరచూ వైఖరి మార్చుకుంటుండంతో వామపక్ష పార్టీలపై ఉన్న నమ్మకాన్ని ప్రజల్లో కోల్పోతున్నామని పార్టీ కేడర్ ఆవేదన చెందుతుంది. ప్రభుత్వ విధానాలు విమర్శిస్తూ..ఎన్నికల్లో అదే పార్టీలకు ఓట్లు వేయాలని కోరడం అంటేనే వామపక్షాల రాజకీయ ప్రయాణంలో ఎక్కడో లోపం ఉందని అభిప్రాయపడుతున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version