కాంగ్రెస్, బీఆర్ఎస్ డూప్ ఫైటింగ్ చేసుకుంటున్నాయని బీజేపీ రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇవాళ పార్టీ స్టేట్ ఆఫీస్ లో ఆయన మాట్లాడుతూ…. బస్సు యాత్ర కాదు.. మోకాళ్ల యాత్ర చేసినా కేసీఆర్ ను ప్రజలు నమ్మరని మండిపడ్డారు. తెలంగాణలో బీజేపీకి 12 సీట్లు వస్తాయని రాజ్ నాథ్ సింగ్ చెప్పడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ లీడర్లు జీర్ణించుకోలేక పోతున్నారు అని అన్నారు. పత్రికల్లో శీర్షికల కోసం అవాకులు, చెవాకులు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.
ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైటెన్షన్ వైర్ లా మారాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ కు గత ఎన్నికల్లో వచ్చిన సీట్లు కూడా రావన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ,ఎంఐఎం, కమ్యూనిస్టులు ఏకమై బీజేపీని ఓడించలేరని అన్నారు. 100 రోజుల పరిపాలనను రెఫరెండంగా చేసుకుని 14 ఎంపీ స్థానాలు గెలుస్తామన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు.