తెలంగాణ రాజకీయాల అందు..కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు వేరయా అన్నట్లు పరిస్తితి కనిపిస్తోంది. ఎక్కడైనా ప్రత్యర్ధులపై పోరాటం చేస్తారు. కానీ కాంగ్రెస్ లో మాత్రం నాయకులు సొంత పార్టీ వాళ్ళ పైనే ఫైట్ చేస్తారు. ఈ రచ్చ వల్లే కాంగ్రెస్ పార్టీ బలం రోజురోజుకూ తగ్గుతూ వస్తుంది. ఇటీవల ఆ రచ్చ మరింత ముదిరితే దిగ్విజయ్ సింగ్ వచ్చి..సరిచేసే కార్యక్రమం చేశారు. ఇదే క్రమంలో రాష్ట్ర ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్‌ని మార్చేసి..మాణిక్ రావు ఠాక్రేని ఇంచార్జ్ గా పెట్టారు.
అటు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని సైతం మార్చాలని చెప్పి సీనియర్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే క్రమంలో రేవంత్ సైతం అవసరమైతే పార్టీ కోసం పదవిని కూడా త్యాగం చేస్తానని అంటున్నారు. ఇదిలా ఉండగానే తాజాగా కాంగ్రెస్ పార్టీతో బీఆర్ఎస్ పొత్తు అని ప్రచారం మొదలైంది..కేంద్రంలో మోదీ సర్కార్‌ని గద్దె దించాలని చెప్పి కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో విపక్ష పార్టీల్ని ఏకం చేయాలని చూస్తున్నారు. కానీ కాంగ్రెస్ లేకుండా విపక్షాలు కలిసి మోదీని దించడం కుదరని పని.
దీంతో కేసీఆర్..కాంగ్రెస్ పార్టీతో కలవడానికి రెడీగా ఉన్నారని ప్రచారం వచ్చింది. ఆ మధ్య కేసీఆర్..బీహార్‌కు వెళ్ళి సీఎం నితిశ్ కుమార్‌ని కలిశారు. ఆ తర్వాత నితిశ్ వెళ్ళి రాహుల్ గాంధీని కలిశారు. అప్పుడు బీఆర్ఎస్ తో పొత్తు ప్రతిపాదిస్తే రాహుల్ తిరస్కరించారని తాజాగా తెలంగాణ కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ చెప్పుకొచ్చారు.
తెలంగాణ కాంగ్రెస్‌లోని కొంతమంది సీనియర్లు తొమ్మిది నెలల క్రితం బీఆర్ఎస్‌తో కాంగ్రెస్ పొత్తు ప్రతిపాదనను ఏఐసీసీ ముందు పెట్టారని, బీఆర్ఎస్‌తో పొత్తుపై ఏఐసీసీ తమ అభిప్రాయాలను అప్పట్లో కోరిందని, అప్పట్లో తాము వద్దని చెప్పినట్లు అద్దంకి దయాకర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్-కాంగ్రెస్ పొత్తు గురించి పార్టీలో చర్చ జరిగిన మాట వాస్తవమేనని, కానీ పొత్తుకు సిద్ధంగా లేమని తేల్చి చెప్పామని అంటున్నారు.
బీఆర్ఎస్ ఇప్పటికీ కాంగ్రెస్‌తో పొత్తుకు ప్రయత్నాలు చేస్తుందని, కానీ కాంగ్రెస్‌లోని కొంతమంది సీనియర్లు ఏఐసీసీ దగ్గర బీఆర్ఎస్ పొత్తు గురించి ప్రపోజల్స్ ఇప్పటికీ పెడుతున్నారని, ఇది కోవర్జిజం కిందకు రాదా? అని అద్దంకి ప్రశ్నించారు. అయితే కాంగ్రెస్ తో పొత్తు ఉండదని బీఆర్ఎస్ అంటుంది. ఇటు రేవంత్ రెడ్డి సైతం బీఆర్ఎస్ తో కలిసే ప్రసక్తి లేదని అంటున్నారు. కానీ కొందరు సీనియర్లు మాత్రం పొత్తు ప్రతిపాదనలు ఇంకా పెడుతున్నారని తెలుస్తోంది. మరి రానున్న రోజుల్లో పొత్తుపై ఏం తేలుతుందో చూడాలి.