న్యూఢిల్లీ: పెగాసస్ అంశం ఇప్పుడు దేశ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. పెగాసస్ స్పైవేర్ ద్వారా ప్రతిపక్షాల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. హ్యాకింగ్‌కు సంబంధించి అధికార పార్టీపై దుమ్మెత్తు పోస్తున్నాయి. అటు పార్లమెంట్‌ను స్తంభింపజేస్తున్నాయి. పెగాసస్‌పై చర్చ జరిపాలని డిమాండ్ చేస్తున్నాయి. పార్లమెంట్ ఉభయ సభల్లో చర్చ పెట్టాల్సిందేనని కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
తాజాగా కాసేపట్లో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కాంగ్రెస్ లోక్ సభ ఎంపీలు సమావేశమయ్యారు. సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తున్నారు. పెగాసస్ పై అధికార పార్టీ నుంచి వివరణ వచ్చే వరకూ వెనక్కి తగ్గేది లేదని ఎంపీలు నిర్ణయించారు. పార్లమెంట్ ఉభయ సభల్లో ఆందోళనలు కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. అవసరమైతే ఆందోళనను ఉధృతం చేయాలని నిర్ణయించుకున్నారు.