పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి ఇంట్లో విందు సమావేశానికి కాంగ్రెస్ సీనియర్ నేతలు హాజరయ్యారు. విందు అనంతరం మీడియాతో మాట్లాడిన నేతలు విష్ణువర్ధన్ రెడ్డి పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలను ఖండించారు. విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ సీనియర్లతో అప్పుడప్పుడు కలుస్తూనే ఉంటానని, ఈ మధ్య చాలా గ్యాప్ వచ్చినందున వారిని లంచ్ కు ఆహ్వానించానని తెలిపారు. అనంతరం వి హనుమంతరావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్కరి సొత్తు కాదని.. అందరూ కలిసి ఉంటేనే బలోపేతమవుతుందని హితవు పలికారు.
పార్టీ నిర్ణయాన్ని మీరన్నట్టు తనపై వస్తున్న వార్తలకు ఇప్పుడే స్పందించనని, సీనియర్లతో చర్చించాకే మాట్లాడుతానని వీహెచ్ తెలిపారు.” జనార్దన్ రెడ్డి కుమారుడు పార్టీని వదిలే ప్రసక్తే లేదు. పార్టీ ఉన్నంత కాలం పార్టీతోనే విష్ణువర్ధన్రెడ్డి ఉంటారు. ఇతర పార్టీలోకి విష్ణు వెళ్తున్నారనేది దుష్ప్రచారం. కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్కరి సొత్తు కాదు, అందరూ కలిసి ఉంటేనే పార్టీ నిలబడుతుంది. టిఆర్ఎస్, బీజేపీలను ఎదుర్కొనేందుకు కలిసికట్టుగా ఉండాలి” అని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ అన్నారు.