ఈటల రాజేందర్ వ్యవహారంలో అంతు చిక్కని రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అండగా కలిసొస్తారనుకున్న వారు విమర్శిస్తున్నారు. మొన్నటి దాకా శతృవులుగా ఉన్న వాళ్లు మిత్రులవుతున్నారు. ఇక కాంగ్రెస్ ఈటల రాజేందర్ విషయంలో రెండు రకాలుగా స్పందిస్తోంది. కాంగ్రెస్ అగ్రనేతలు ఈటలకు మద్దతు తెలుపుతుంటే ఆయన నియోజకవర్గ నేతలు మాత్రం వ్యతిరేకిస్తున్నారు.
ఇప్పటికే కాంగ్రెస్ సభాపక్షనేత మల్లు భట్టి విక్రమార్క, ఎంపీ రేవంత్‌రెడ్డి లాంటి వాళ్లు ఈటలకు మద్దతు తెలుపుతున్నారు. కాంగ్రెస్‌లోకి రావాలంటూ కోరుతున్నారు. మొన్న ఏకంగా ఈటల ఇంటికెళ్లి మరీ భేటీ అయ్యారు. ఇలా వారు ఈటలకు సపోర్టు చేస్తున్నారు.
కానీ హుజురాబాద్ కాంగ్రెస్ ఇన్‌చార్జి పాడి కౌశిక్‌రెడ్డి మాత్రం ఈటలను తీవ్ర స్థాయిలో ఆరోపిస్తున్నారు. ఆయన తప్పుచేశారని పదేపదే విమర్శిస్తున్నారు. దీంతో కౌశిక్‌రెడ్డి వ్యవహారంలో కాంగ్రెస్ పెద్దలు కాస్త అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈటలను ఎలాగైనా పార్టీలో చేర్చుకుని బీసీల అండ పొందాలని పార్టీ చూస్తుంటే.. స్థానిక నేత అలా మాట్లాడటం అందరికీ ఇబ్బంది కలిగిస్తోంది. అయితే కౌశిక్‌రెడ్డి టీఆర్ ఎస్‌లో చేరతారని, అక్కడి నుంచే పోటీ చేస్తారనే ప్రచారం కూడా సాగుతోంది. మరి ఈ ద్వంద్వ వైఖరికి కాంగ్రెస్ ముగింపు ఎలా ఇస్తుందో చూడాలి.