కొత్త రాగం అందుకున్న తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు

-

తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుల స్వరం మారింది. కొత్త పీసీసీ చీఫ్‌ ఎంపిక కొలిక్కి వచ్చిందని తెలియగానే కొత్త రాగం అందుకున్నారు. అలకబూనారు. తెలంగాణ పీసీసీ కోసం అభిప్రాయ సేకరణ మొదలు పెట్టినప్పటి నుంచి.. కాంగ్రెస్‌లో భిన్నాభిప్రాయాలు… భిన్న వాదనలు వినిపించాయి. మరి..ఇక్కడితో సరిపెడతారా.. అనూహ్య పరిణామాలు ఉంటాయా అన్నది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తి రేపుతుంది.

ఎంపీ రేవంత్‌రెడ్డిని పీసీసీ చీఫ్‌ను చేస్తే పార్టీ నుంచి బయటకెళ్లిపోయే వారి సంఖ్య ఎక్కువే అని ఠాగూర్‌కి స్పష్టం చేశారు. ఇలా చెప్పిన వారిలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డితోపాటు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీనియర్‌ నేత వీహెఛ్ ఉన్నారు. మరి.. ఢిల్లీ నుంచి ఎలాంటి సంకేతాలు అందాయో ఏమో కొందరు సీనియర్‌ నేతల స్వరాల్లో అప్పుడే మార్పు వచ్చేసింది.

పీసీసీ పీఠం ఎవరికి ఇచ్చినా వాళ్ల ఇష్టం అని ఇన్నాళ్లు చెప్పిన నాయకులు.. ఒక్కసారిగా అధిష్ఠానంపై అలక బూనారు. ఎప్పుడూ సోనియా, రాహుల్‌ గాంధీల గురించి మాట్లాడని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఇప్పుడు ఎందుకు వారి ప్రస్తావన చేశారు అన్నది చర్చ జరుగుతోంది. పార్టీ చీఫ్‌ సోనియాగాంధీకి పంపించిన లిస్ట్‌లో తన పేరు లేకపోవడం దురదృష్టకరమని కామెంట్ చేశారు. 2017లో పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సంగారెడ్డిలో రాహుల్‌ గాంధీ సభ పెట్టాలని చెప్పగానే కోట్లు ఖర్చుపెట్టి సభ నిర్వహించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అయినా జగ్గారెడ్డి కనీసం రేస్‌లో ఉన్నారన్నది సోనియా, రాహుల్‌ దగ్గర చర్చకు రాకపోవడం బాధపెట్టిందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఇంఛార్జ్‌ ఠాగూర్‌ పేరును తీసుకొచ్చారు. దీంతో జగ్గారెడ్డి వ్యూహం ఏంటన్న చర్చ మొదలైంది.

కాంగ్రెస్‌లో గాంధీ ఫ్యామిలీకి దగ్గరగా ఉండే వి.హన్మంతరావు కూడా ఈ సమయంలో మరింత సంచలనంగా మారారు. రాష్ట్ర పార్టీ వ్యవహారాలు చెప్పుకోవడానికి అవకాశం దక్కడం లేదన్న అసంతృప్తితో ఉన్నారాయన. రెండేళ్లుగా అధిష్ఠానాన్ని కలిసి మనసు విప్పి మాట్లాడాలని చూస్తున్నా.. వీహెఛ్ కు అపాయింట్‌మెంట్‌ లేదట. గతంలో 23 మంది నాయకులు లేఖ రాస్తే పిలిచి మాట్లాడిన సోనియాగాంధీ.. ఇప్పుడు ఎన్ని లేఖలు రాసినా మేడమ్‌ స్పందించకపోయే సరికి ఆయన నారాజ్‌తో ఉన్నారట. అటు జగ్గారెడ్డి, ఇటు VH ఒకేసారి కొత్త పల్లవి అందుకోవడం చూసిన పార్టీ వర్గాలు వీరేమైనా తిరుగుబావుటా ఎగరేస్తారా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారట.

ఇప్పటికే కాంగ్రెస్‌ నుంచి అనేక మంది సర్దుకుంటున్నారు. వీలు చిక్కితే టీఆర్‌ఎస్‌లోకి.. లేదంటే బీజేపీ గూటికి వెళ్తున్నారు. ఈ టైమ్‌లో పార్టీని సెట్‌ చేస్తారని భావించిన ఇంఛార్జ్‌ ఠాగూర్‌ సైతం తమను పట్టించుకోవడం లేదని చాలా మంది ఆవేదనతో ఉన్నారట. కాకపోతే జగ్గారెడ్డి, వీహెచ్ లే బయటపడ్డారని చెబుతున్నారు. మరి.. వీరిద్దరితో ఈ అలజడి ఆగుతుందో.. మరికొంత మంది స్వరం కలుపుతారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news